Pilli Subhas Chandra Bose: పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో టీడీపీ నేతల భేటీ.. ఆ వెంటనే వైసీపీ హై కమాండ్ పిలుపు!
- రామచంద్రపురంలో ఎంపీ పిల్లి సుభాష్ వర్సెస్ మంత్రి వేణు
- వేణుకు మళ్లీ టికెట్ ఇస్తే.. స్వతంత్రుడిగా పోటీ చేస్తానన్న బోస్
- బోస్ జనసేనలో చేరబోతున్నారంటూ ప్రచారం
- ఈ రోజు ఆయన నివాసానికి స్థానిక టీడీపీ నేతలు
- వెంటనే కబురు పంపిన వైసీపీ హైకమాండ్
- బోస్‌తో చర్చలు జరిపిన మిథున్ రెడ్డి.. సద్దుమణిగిన వివాదం?
రామచంద్రపురంలో అధికార వైసీపీలో వర్గపోరు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గం తీవ్ర ఆగ్రహంగా ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి వేణుకు రామచంద్రపురం నుంచి టికెట్ ఇస్తే.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ పిల్లి సుభాష్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు ఉదయం ఎంపీ పిల్లి సుభాష్ నివాసానికి స్థానిక టీడీపీ నేతలు వెళ్లారు. ఇటీవల గుండెకు స్టెంట్ వేయించుకున్న సుభాష్ పెద్ద కుమారుడిని పరామర్శించారు. అంతకుముందు జనసేనలోకి పిల్లి సుభాష్ చంద్రబోస్ వెళ్తారంటూ స్థానికంగా ప్రచారం జరిగింది. ఇవాళో రేపో ఆ పార్టీ కండువా కప్పుకోబోతున్నారంటూ చర్చ సాగింది.
ఈ ఘటనలతో వైసీపీ హైకమాండ్ అలర్ట్ అయింది. వెంటనే పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు కబురు పంపింది. దీంతో బోస్ తన కుమారుడితో కలిసి తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. వారితో పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి చర్చించారు. వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నించారు.
మిథున్ రెడ్డితో భేటీ తర్వాత సుభాష్ చంద్రబోస్ మెత్తబడినట్లు సమాచారం. రేపటి నుంచి లోక్‌సభ సమావేశాలకు వెళ్తానని చెప్పినట్లు తెలిసింది. రామచంద్రపురం గొడవపై ఈ రోజు క్లారిటీ వచ్చే చాన్స్ ఉందని నేతలు చెబుతున్నారు. సాయంత్రం మీడియాతో బోస్ మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు.