Chandrababu: నిన్న ఈయన పెద్ద దానకర్ణుడిలా మాట్లాడుతున్నాడు: సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్
- అమరావతి ప్రజారాజధాని అని స్పష్టీకరణ
- రైతుల త్యాగాన్ని జగన్ బూడిదలో పోసిన పన్నీరు చేశాడని మండిపాటు
- రైతులకు కులం, మతం, ప్రాంతం అంటగట్టాడని ఆగ్రహం
- సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శనాస్త్రాలు
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించి, సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల చొరవ, త్యాగాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసిన ఈ వ్యక్తి పెద్ద దానకర్ణుడిలా పేదలకు ఇళ్ల స్థలాలంటున్నాడని మండిపడ్డారు.
అమరావతి ప్రజారాజధాని.... ఈ మాట మేం చెప్పడం కాదు... ప్రపంచంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిల్లోని పవిత్రమైన నీటిని, మట్టితో పూజలు చేసి సత్సంకల్పంతో నిర్మాణాలు తలపెట్టామని వెల్లడించారు.
"నిన్న ఈయన పేదలకు ఇళ్ల స్థలాలిస్తూ, పెద్ద దానకర్ణుడిలా మాట్లాడాడు. రైతుని రైతుగా గౌరవించకుండా కులం, మతం, ప్రాంతం అంటగట్టి సిగ్గుఎగ్గులేకుండా ఏది పడితే అది మాట్లాడతారా? సుప్రీంకోర్టు చెప్పింది, హై కోర్టు ఇచ్చేసిందని చెబుతున్నాడు. రైతులు ముందుకొచ్చి చూపిన చొరవను, వారి త్యాగాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశాడు. ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లల్ని మన రాజధాని ఏది అని అడిగితే వారేం సమాధానం చెబుతారు?" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, రాష్ట్రంలో రైతు బతకాలంటే జగన్ పోవాల్సిందేనని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ పాలనలో 3 వేల రైతు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ విధానాలతో సాగు భారమై రైతులు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో గంజాయి సాగు తప్ప మరే సాగూ సాగడం లేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక... వెంటిలేటర్ పై ఉన్న రైతన్నను మళ్లీ నిలబెడతామని పేర్కొన్నారు.
అన్నదాతతో ప్రతిరైతుకి రూ.20వేలు ఇస్తామని, గతంలో అమలు చేసిన అన్ని పథకాలు పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం ఎంత సంక్షోభంలో కూరుకుపోతుందో చెప్పడానికి వైసీపీ నాలుగేళ్లపాలనే నిదర్శనం అని అన్నారు.
"ఖరీఫ్ ప్రారంభమైనా రాష్ట్రంలో ఇప్పటికీ వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. జూన్ 1 నాటికే వర్షాలు పడి, ఇప్పటికే చాలావరకు సాగు ప్రారంభం కావాలి. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రైతుల పరిస్థితి, వ్యవసాయ స్థితిగతులపై ఇంతవరకు సమీక్ష చేసింది లేదు.
రాష్ట్రంలో ఏ పంటవేసే రైతు అయినా బాగున్నాడా? పల్నాడు, గుంటూరు జిల్లాలు అనగానే మిర్చి, గోదావరి జిల్లాల పేరు చెప్పగానే ధాన్యం రైతులు, అనంతపురం జిల్లాలో వేరశనగ, కర్నూలు జిల్లాలో పత్తి రైతు, ఉత్తరాంధ్రలో జీడిరైతు వీరిలో ఒక్కరైనా బాగున్నారా? ఏ ఒక్కరైతు అయినా ఈ ప్రభుత్వంలో నేను బాగున్నానని, బాగుపడ్డానని చెప్పే స్థితిలో ఉన్నాడా?
జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గుడి పాలనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగవుతున్నది గంజాయి పంటమాత్రమే. మరే ఇతర పంటల సాగుని ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. తప్పుడు లెక్కల్లో ఇతను సిద్ధహస్తుడు. వాస్తవంగా చనిపోయిన రైతు కుటుంబాలకు సాయంచేస్తే రూ.210 కోట్లవరకు ఇవ్వాలి. కేవలం 672 మంది చనిపోయినట్టు చూపించి, రూ.47 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు.
ఒకప్పుడు ఇక్కడ రైతాంగం ఒక ఎకరా అమ్మి హైదరాబాద్ లో 4, 5 ఎకరాలు కొనేవారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఎకరా అమ్మితే ఇక్కడ వంద ఎకరాలు కొనే పరిస్థితి. ఎవరు కారణం దీనికి? ఈ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, మీ అధికార వ్యామోహం, దోపిడీ రాష్ట్రానికి శాపంగా మారింది.
రైతులు వరిసాగు మానేస్తున్నారు. దాంతో బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. అమెరికాలోని భారతీయులు బియ్యం రావన్న భయంతో, ఎగబడి కొంటున్నారు. ముందుచూపుతో కరెక్ట్ గా పనిచేస్తే ఇలాంటి పరిస్థితి రాదు. ఈ ముఖ్యమంత్రికి అన్నీ దొంగచూపులు, అడ్డదారులే.
టీడీపీ హయాంలో వ్యవసాయంలో 11 శాతం వృద్ధిరేటు సాధించాం. స్వాతంత్ర్యం వచ్చాక వ్యవసాయంలో ఐదేళ్లపాటు 11 శాతం వృద్ధిరేటు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. నేను ఛాలెంజ్ చేస్తున్నా.. మేం సాధించింది ఇదీ అని నేను చాలెంజ్ చేస్తున్నా. మీరు వచ్చి ఏం చేశారు? 4.16 శాతానికి వ్యవసాయ బడ్జెట్ తగ్గించారు" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.