Kadapa District: సాధ్యం కాదు... కడప స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక ప్రకటన
- ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్ అంశాలపై లోక్ సభలో కేంద్రం ప్రకటన
- విభజన సమస్యలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవచ్చునని వెల్లడి
- మధ్యవర్తిగా వ్యవహరిస్తామని స్పష్టీకరణ
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎంపీ కేశినేని అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ సాంకేతికంగా, ఆర్థికంగా లాభదాయకం కాదని తెలిపింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విభజన సమస్యలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవచ్చునని, తాము మధ్యవర్తిగ వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఇక మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఉన్నత విద్యాసంస్థలు దీర్ఘకాలిక ప్రాజెక్టులని తెలిపారు. రూ.106 కోట్లతో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యాలయాన్ని నిర్మిస్తామని, ఇందుకోసం 2023-24లో రూ.10 కోట్లు కేటాయించారన్నారు.
దుగరాజుపట్నం పోర్టు ఏర్పాటు ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాలేదన్నారు. రాయపట్నం పోర్టును అభివృద్ధి చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సూచించిందని తెలిపారు. రాయపట్నం నాన్-మేజర్ పోర్టుగా ఇప్పటికే నోటిఫై చేశారని తెలిపిన కేంద్రం, రామాయపట్నం మైనర్ పోర్టును డీ-నోటిఫై చేయాలని ఏపీకి చెప్పామని కేంద్రం తెలిపింది. రామాయపట్నం పోర్టు వద్దంటే మేజర్ పోర్టుకు మరో ప్రదేశం గుర్తించాలని కేంద్రం సూచించింది. యూనివర్సిటీలు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని కోసం రూ.21,154 కోట్లు కేటాయించామని తెలిపింది. ఐఐటీ, ఐసర్ కు రూ.2200 కోట్లకు పైగా విడుదల చేసినట్లు చెప్పారు. ఎయిమ్స్ కు రూ.1319 కోట్లు, గిరిజన వర్సిటీకి రూ.24 కోట్లు, వ్యవసాయ యూనివర్సిటీకి రూ.135 కోట్లు, రాజధాని నిర్మాణం కోసం రూ.2500 కోట్లు, పోలవరం ప్రాజెక్టు కోసం రూ.14,969 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది.