Team India: వరల్డ్ కప్ ముందు ఆసీస్ తో వన్డే సిరీస్ ఆడనున్న టీమిండియా... షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
- ఈసారి భారత్ లో వన్డే వరల్డ్ కప్
- అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు వరల్డ్ కప్ మ్యాచ్ లు
- సెప్టెంబరులో భారత్ గడ్డపై వన్డే సిరీస్ ఆడనున్న ఆసీస్
నాలుగేళ్లకోసారి వచ్చే వన్డే వరల్డ్ కప్ కు ఈ ఏడాది భారత్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్ లోని వివిధ వేదికల్లో వరల్డ్ కప్ పోటీలు జరగనున్నాయి.
కాగా, ఈ వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు సరైన ప్రాక్టీస్ లభించనుంది. వరల్డ్ కప్ ముంగిట టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ జరగనుంది. మూడు వన్డేల ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు సెప్టెంబరులో భారత్ రానుంది.
తొలి వన్డే సెప్టెంబరు 22న మొహాలీలో, రెండో వన్డే సెప్టెంబరు 24న ఇందోర్ లో, మూడో వన్డే సెప్టెంబరు 27న రాజ్ కోట్ లో జరగనున్నాయి. సొంతగడ్డపై జరిగే వరల్డ్ కప్ కు సన్నద్ధమయ్యేందుకు టీమిండియాకు ఈ సిరీస్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
కాగా, వరల్డ్ కప్ అనంతరం కూడా ఆసీస్ జట్టు భారత్ లోనే ఉండిపోనుంది. నవంబరు 23 నుంచి డిసెంబరు 3 వరకు టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి.
తొలి మ్యాచ్ నవంబరు 23న వైజాగ్ లో, రెండో మ్యాచ్ నవంబరు 26న తిరువనంతపురంలో, మూడో మ్యాచ్ నవంబరు 28న గౌహతిలో, నాలుగో మ్యాచ్ డిసెంబరు 1న నాగపూర్ లో, ఐదో మ్యాచ్ డిసెంబరు 3న హైదరాబాద్ లో జరగనుంది.
ఇక వచ్చే ఏడాది జనవరిలో భారత్ తో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం ఆఫ్ఘనిస్థాన్ జట్టు రానుంది. అనంతరం, ఇంగ్లండ్ జట్టు భారత గడ్డపై ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ లో పాల్గొంటుంది.
ఇందులో తొలి టెస్టుకు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. రెండో టెస్టు ఆతిథ్య అవకాశాన్ని వైజాగ్ లోని వీడీసీఏ-వైఎస్సార్ స్టేడియం దక్కించుకుంది. ఈ మేరకు బీసీసీఐ 2023-24 సీజన్ షెడ్యూల్ విడుదల చేసింది.