BJP: బీజేపీ వార్ రూమ్ కసరత్తు... అర్వింద్, రఘునందనరావుకు కీలక బాధ్యతలు!
- కిషన్ రెడ్డి అధ్యక్షతన వివిధ విభాగాల నాయకుల సమావేశం
- అమిత్ షా పర్యటనను విజయవంతం చేయాలని దిశా నిర్దేశం
- పలువురికి బాధ్యతల అప్పగింత!
బీజేపీకి చెందిన వివిధ విభాగాల నేతలతో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన నేపథ్యంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు.
అమిత్ షా సమావేశానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించాలని నిర్ణయించారు. డాక్టర్లు, టీచర్లు, లాయర్లు, వ్యాపారులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించనున్నారు. అమిత్ షా పర్యటనను విజయవంతం చేయాలని కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర కార్యాలయం వార్ రూమ్ కసరత్తులో పలువురికి బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి రేపు అధికారికంగా ప్రకటన వెలువడవచ్చునని తెలుస్తోంది. వార్ రూమ్ ఇంఛార్జ్‌గా సయ్యద్ జాఫర్ ఇస్లాంను, స్ట్రాటెజీ టీమ్ ఇంఛార్జ్‌గా శ్వేతశాలినిని నియమించారని తెలుస్తోంది.
అలాగే, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావుకు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. ఇంద్రసేనరెడ్డి, చింతల రామచంద్రారెడ్డిలకు కో-ఆర్డినేషన్ కమిటీ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది.