Parliament: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. లోక్ సభ స్పీకర్ కు నోటీసులు

No Confidence Motion In Lok Sabha

  • తీర్మానం ప్రవేశ పెట్టనున్నట్లు పేర్కొన్న కాంగ్రెస్, బీఆర్ఎస్
  • తీర్మాన ముసాయిదాను సిద్ధం చేసిన పార్టీలు
  • లోక్ సభలో బలాబలాలు.. ఎన్డీయే 330, ఇండియా కూటమి 140

మణిపూర్ అల్లర్లపై పార్లమెంట్ లో విపక్ష నేతల ఆందోళన కొనసాగుతోంది. మణిపూర్ పై ప్రధాని మోదీ సభలో మాట్లాడాల్సిందేనని పట్టుబడుతున్నాయి. చర్చకు సిద్ధమేనంటున్న ప్రభుత్వం.. ప్రతిపక్షాల ప్రశ్నలకు హోంమంత్రి అమిత్ షా జవాబిస్తారని చెబుతోంది. దీనికి ససేమిరా అంటున్న ప్రతిపక్షాలు.. ప్రధాని మోదీ సభలో మణిపూర్ అంశంపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఉభయ సభలలో గందరగోళం నెలకొంది. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి.

ఇందులో భాగంగా బుధవారం ఉదయం స్పీకర్ కార్యాలయానికి నోటీసులు ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ నేత మాణికం ఠాగూర్ వెల్లడించారు. బీఆర్ఎస్ తరఫున ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటీసు ఇచ్చారు. ఇందుకోసం ముసాయిదా తీర్మానం కూడా సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పటికీ అది వీగిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. లోక్ సభలో బలాబలాలు చూస్తే.. ప్రతిపక్ష కూటమికి కేవలం 140 మంది సభ్యుల మద్ధతు మాత్రమే ఉంది. అదే సమయంలో అధికార ఎన్డీయే కూటమికి 330 మంది సభ్యుల మద్దతు ఉంది. మిగతా 60 మంది సభ్యులు ఏ కూటమిలోనూ లేరు. దీంతో అవిశ్వాస తీర్మానం నిలబడదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ విషయం ప్రతిపక్ష పార్టీలకూ తెలుసని అయినా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం వెనక వాటి ఉద్దేశం వేరని అంటున్నారు. మణిపూర్ అల్లర్లు, హింసపై చర్చించేందుకే ప్రతిపక్షాలు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం వస్తుందని, ఆ చర్చలో పలు అంశాలను లేవనెత్తేందుకు తమకు అవకాశం లభిస్తుందని కూటమి నేతలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News