BRS: అభ్యర్థుల జాబితాపై ఉదయం నుండి సీనియర్లతో కేసీఆర్ సమాలోచనలు
- ఆగస్టు చివరి వారంలో తొలి జాబితా విడుదలయ్యే అవకాశం
- మిగతా పార్టీల కంటే ముందే విడుదల చేయాలనే అభిప్రాయం
- ఐఏఎస్ల బదిలీల పైనా నేతలతో చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం నుండి పార్టీ సీనియర్లతో ప్రగతి భవన్ లో సమాలోచనలు జరుపుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా, పలువురు సీనియర్ ఐఏఎస్ల బదిలీలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ డిసెంబర్ నెలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల జాబితాను సాధ్యమైనంత త్వరగా విడుదల చేసి ప్రచారానికి ఇతర పార్టీల కంటే ముందుగా వెళ్లాలని చూస్తున్నారు.
ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం నుండి ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగుల బలం, వారి గెలుపోటములపై సీనియర్లతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో సిట్టింగులతోనే తొలి జాబితాను ఖరారు చేసి ఆగస్టు చివరి వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. యాభై నుండి డెబ్బై మంది సిట్టింగుల పేర్లను విడుదల చేయవచ్చునని తెలుస్తోంది. అదే సమయంలో రేపు, ఎల్లుండి పలువురు సీనియర్ ఐఏఎస్ లను బదిలీ చేయనున్నారని, ఇందుకు సంబంధించి కూడా సీనియర్లతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.