Narendra Modi: ఇది మోదీ ఇస్తున్న హామీ: ప్రధాని
- మూడోసారి గెలిచాక భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని వ్యాఖ్య
- బీజేపీ హయాంలో మౌలిక సదుపాయాలు పెంచినట్లు తెలిపిన మోదీ
- గ్రామాల్లో 4 లక్షల కిలో మీటర్ల రోడ్లు వేశామన్న ప్రధాని
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలిచి బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని, అప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడో స్థానానికి ఎగబాకుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో ప్రగతి మైదాన్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ... భారత దేశంలో మౌలిక సదుపాయాల్లో మార్పు వచ్చిందని, తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ఎన్నో సౌకర్యాలు వచ్చినట్లు చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు బ్రిడ్జి, అతి పొడవైన సొరంగం దేశంలో ఉన్నాయన్నారు. అత్యంత ఎత్తైన మోటార్ రోడ్డు, అతిపెద్ద స్టేడియం, అత్యంత పెద్ద విగ్రహం మన వద్దనే ఉన్నాయన్నారు.
బీజేపీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ పదో స్థానంలో ఉందని, రెండోసారి అధికారంలోకి వచ్చాక ఐదో స్థానానికి ఎగబాకిందన్నారు. మూడోసారి గెలిచాక ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని, ఇది మోదీ ఇస్తున్న హామీ అని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం వచ్చాక 60 ఏళ్లలో 20,000 కిలో మీటర్ల రైల్వే లైన్ ను మాత్రమే విద్యుద్ధీకరిస్తే.. గత తొమ్మిదేళ్లలో తాము 40,000 కిలో మీటర్ల రైల్వే లైన్లను విద్యుద్ధీకరించామని, ఇప్పుడు ప్రతి నెల 6 కిలో మీటర్ల మెట్రో లైన్ ను పూర్తి చేస్తున్నామన్నారు. 4 లక్షల కిలో మీటర్ల మేర గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. విమానాశ్రయాల సంఖ్య 150కి చేరుకుందన్నారు.