India: I-N-D-I-A కూటమి లీడర్ ఎవరన్న ప్రశ్నకు ఉద్ధవ్ థాకరే ఏం చెప్పారంటే..!
- ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే కూటమి కట్టామని వివరణ
- నాయకుడి ఎంపిక తప్పనిసరి తంతు కాదని వెల్లడి
- అవకాశం వచ్చినపుడు నాయకుడు ఆటోమేటిక్ గా వస్తాడన్న థాకరే
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా 26 ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. 'ఇండియా' పేరుతో ఏర్పడిన ఈ కూటమికి నాయకత్వం వహించేది ఎవరని రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రెండు మార్లు సమావేశం అయినప్పటికీ కూటమికి నాయకుడిని ఎన్నుకోవడంపై ప్రతిపక్షాలు ఓ నిర్ణయానికి రాలేదు. ప్రస్తుతం ఈ విషయంపైనే బీజేపీ సహా ఎన్డీయే కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్షాల కూటమిని ముందుండి నడిపించే నాయకుడే లేడని ఎద్దేవా చేస్తున్నారు. తాజాగా ఇండియా కూటమికి నాయకుడు ఎవరన్న ప్రశ్నకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (ఉద్ధవ్) పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే స్పందించారు.
ఇండియా కూటమికి నాయకుడంటూ ఎవరూ లేరని ఉద్ధవ్ స్పష్టం చేశారు. అయితే, ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని రక్షించేందుకు తామంతా కూటమిగా ఏర్పడ్డామని, కూటమిలోని పార్టీల ఉమ్మడి లక్ష్యం అదేనని వివరించారు. కూటమికి నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం అంతగా లేదని చెప్పారు. జనాలకు పెద్దగా తెలియని వ్యక్తులు కూడా అవకాశం రాగానే తమలోని నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి అందరి మెప్పును పొందారని చెప్పారు. చరిత్రలో ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయని ఉద్ధవ్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహారావు ఇందుకు చక్కని ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. రాజీవ్ గాంధీ హఠాన్మరణం తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారని ఉద్ధవ్ గుర్తుచేశారు.