Seema Haider: పాక్‌ నుంచి అక్రమంగా వచ్చిన సీమా హైదర్‌‌కు నకిలీ పత్రాలు ఇచ్చిన ఇద్దరి అరెస్ట్

Noida Police arrests 2 accomplices who helped Seema Haider Sachin get married

  • పబ్‌జీ ద్వారా పరిచయమైన సచిన్‌ కోసం నోయిడా వచ్చిన సీమా హైదర్‌‌ 
  • ఇద్దరి పెళ్లి కోసం నకిలీ గుర్తింపు పత్రాలు తయారు చేసిన యూపీ వ్యక్తులను పట్టుకున్న పోలీసులు
  • మేలో నేపాల్‌ మీదుగా భారత్‌లోకి ప్రవేశించిన సీమా హైదర్

ఆన్‌లైన్ మొబైల్ గేమ్ పబ్‌జీ ద్వారా పరిచయమైన తన ప్రేమికుడిని వివాహం చేసుకోవడానికి అక్రమంగా భారత్‌కు వచ్చిన సీమా హైదర్ అనే పాకిస్థానీ మహిళ కోసం నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించిన ఇద్దరు వ్యక్తులను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన పుష్పేంద్ర, పవన్‌గా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మొత్తం 15 నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరినీ గత మూడు రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో నకిలీ పత్రాల రాకెట్‌లో ఈ ఇద్దరికీ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

కాగా, కరోనా సమయంలో పబ్‌ జీ ఆడుతున్నప్పుడు గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలో నివసిస్తున్న 22 ఏళ్ల సచిన్ మీనాతో తాను ప్రేమలో పడ్డానని 30 ఏళ్ల పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ చెప్పింది. ఇప్పటికే గులాం హైదర్‌ అనే వ్యక్తితో వివాహమై నలుగురు పిల్లలతో ఉన్న సీమా.. సచిన్‌తో కలిసి ఉండేందుకు పాకిస్థాన్‌ నుంచి అక్రమంగా సరిహద్దులు దాటి భారత్‌లోకి వచ్చింది. ఆమె మొదట మార్చిలో నేపాల్‌లో సచిన్‌ను పెళ్లి చేసుకుంది. మే 13న పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించింది. దేశంలోకి అక్రమంగా చొరబడినందుకు సీమాను, ఆమెకు ఆశ్రయం ఇచ్చినందుకు సచిన్‌ను ఈనెల 4న పోలీసులు అరెస్ట్ చేశారు. సీమా పాక్‌ గూఢచారి అనే అనుమానంతో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News