Vasireddy Padma: ప్రేమ కారణంగానే అమ్మాయిల అదృశ్యం.. సినిమాలు కూడా దీనికి కారణం: పవన్ పై వాసిరెడ్డి పద్మ విమర్శలు
- ఏపీలో 26 వేల మంది మిస్సింగ్ అని పార్లమెంటులో కేంద్రం ప్రకటన
- ఏపీ ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
- ఏపీలో మహిళల అదృశ్యం పైనే రాజ్యసభ ఆందోళన చెందుతోందని వాసిరెడ్డి పద్మ విమర్శ
- మహిళలంటే పవన్ కు గౌరవం లేదని మండిపాటు
ఏపీలో 26 వేల మంది మహిళలు, అమ్మాయిలు అదృశ్యమయ్యారని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల అక్రమ రవాణా వెనుక కొందరు వాలంటీర్ల ప్రమేయం ఉందని జనసేనాని పవన్ కల్యాణ్ కూడా విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మండిపడ్డారు. ఏపీలో మహిళల అదృశ్యం పైనే రాజ్యసభ ఎందుకు ఎక్కువ ఆందోళన చెందుతోందని పద్మ ప్రశ్నించారు. మహిళల అదృశ్యంలో ఏపీ 11వ స్థానంలో ఉందని, ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ ఎందుకు ప్రస్తావించడం లేదని అన్నారు. ఏపీనే పవన్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రేమ వ్యవహారాల వల్లే చాలా మంది అమ్మాయిలు అదృశ్యమవుతున్నారని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ ప్రేమలకు సినిమాలు కూడా కారణం కాదా? అని ప్రశ్నించారు. తప్పిపోయిన వారిలో 70 శాతం మంది వెనక్కి వస్తున్నారనే విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించడాన్ని పవన్ నేర్చుకోవాలని హితవు పలికారు. మహిళా కమిషన్ అన్నా కూడా పవన్ కు గౌరవం లేదని విమర్శించారు. భరణం ఇచ్చి వదిలించుకుంటామంటే ఏ మహిళ అయినా అంగీకరిస్తుందా? అని పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.