Roja: చంద్రబాబు నోరు పురుగులు పట్టడం ఖాయం: మంత్రి రోజా

Roja fires at Chandrababu Naidu in Puttur

  • జగనన్న దానకర్ణుడు అయితే చంద్రబాబు కుంభకర్ణుడని విమర్శ
  • పాదయాత్రలో ఇచ్చిన ప్రతి మాటను జగన్ నెరవేరుస్తున్నాడన్న రోజా
  • చంద్రబాబుది మాత్రం 420 విజన్ అని ఆగ్రహం
  • జగన్ పాలనలో గంజాయి పంట సాగు ఉందనడం విడ్డూరమని వ్యాఖ్య

జగనన్న దానకర్ణుడు అయితే చంద్రబాబు కుంభకర్ణుడని మంత్రి రోజా అన్నారు. ఆమె గురువారం పుత్తూరు మున్సిపాలిటీలోని గోవిందపాళ్ళెం, పిళ్ళారిపట్టు, దాసరిగుంట సచివాలయాల పరిధిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పుత్తూరును మున్సిపాలిటీగా మార్చి నాడు టీడీపీ ప్రజలపై పన్నుల భారం వేసిందన్నారు. జగన్ చిన్నవయసులోనే తండ్రికి మించిన తనయుడుగా ప్రజాదరణ పొందుతున్నారని కితాబునిచ్చారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసి అధికారంలోకి రాగానే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. నాడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చారన్నారు. నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇదే అన్నారు.

చంద్రబాబుది మాత్రం 420 విజన్ అని, ప్రజలకు ఉపయోగపడే విజన్ మాత్రం కాదన్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా, నేతన్న నేస్తం వంటి ప్రజలకి ఉపయోగపడే పథకాలను చంద్రబాబు తన పాలనలో ఎందుకు తీసుకు రాలేకపోయారని ప్రశ్నించారు. ఈ రోజు రాజధాని ప్రాంతంలో 50 వేల ఇళ్లకు శంకుస్థాపన చేస్తే, చంద్రబాబు దానిని చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. 

తాను సూటిగా అడుగుతున్నానని, రాజధాని భూములు ఏమైనా మీ నాయన ఖర్జుర నాయుడివా? లేక నువ్వు దాన కర్ణుడువా? సింగపూర్ వాళ్లకు ఎలా దోచిపెట్టావు? రైతుల నుండి రాజధానికి ఎలా లాక్కున్నావు? అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో గంజాయి సాగు విచ్చలవిడిగా సాగిందని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్ పాలనలో గంజాయి పంట సాగు చేస్తున్నారనడం విడ్డూరమన్నారు. 

ముమ్మాటికి చంద్రబాబు నోరు పురుగులు పట్టడం ఖాయమని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో నాటి మాజీ మంత్రి గంటా.. గంజాయి పంట ఎక్కువగా సాగు చేస్తున్నారని స్వయంగా తానే చెప్పాడని, పుత్తూరులో టీడీపీ నేతలు గంజాయి విక్రయం చేస్తూ పోలీసులకు రెండుసార్లు దొరికాన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ గంజాయి సాగును ఉక్కుపాదంతో అణచివేస్తున్నారన్నారు. గంజాయి మాఫియా వెన్నులో వణుకు పుట్టించారన్నారు. జగన్ 17 మెడికల్ కాలేజీ లు రాష్ట్రానికి తీసుకు వచ్చారన్నారు. పుత్తూరు - నగరి మధ్య ఫోర్ లైన్ జాతీయ రహదారి పనులు అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకు కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోజా భర్త ఆర్కే సెల్వామణి వచ్చారు.

  • Loading...

More Telugu News