China: చైనాలో కొత్త ట్రెండ్.. ‘ఫుల్ టైం’ సంతానంగా మారిపోతున్న యువత
- చైనాలో నానాటికీ పెరిగిపోతున్న పోటీ, తరిగిపోతున్న ఉద్యోగావకాశాలు
- కరోనా సంక్షోభం తరువాత యువత దృక్పథంలో మార్పులు, ప్రశాంత జీవనానికి ఓటు
- తల్లిదండ్రులకు ఫుల్ టైం సంతానంగా మారిపోతున్న యువత
- వారి బాగోగులు చూసుకునేందుకు జీతాలు తీసుకుంటున్న వైనం
ఫుల్ టైం ఉద్యోగాలు, పార్ట్ టైం ఉద్యోగాల గురించి తెలిసిందే కానీ ప్రస్తుతం చైనాలో ఫుల్ టైం సంతానాల ట్రెండ్ కూడా ఊపందుకుంటోంది. అక్కడి యువత సాధారణ ఉద్యోగాలకు బదులు పూర్తిస్థాయిలో ఇంటి పట్టునే ఉండే ఫుల్ టైం సంతానంగా మారిపోతున్నారు. తమకు సేవ చేసినందుకు తల్లిదండ్రులు వారికి మంచి జీతాలు కూడా ఇస్తున్నారు.
బయటి ప్రపంచంలో తీవ్రమైన పోటీ, నానాటికీ తరిగిపోతున్న అవకాశాలు వెరసి కొందరు ఈ బాట పడుతున్నారట. జీవితమంతా పోటీలోనే గడిపేస్తూ వృథా చేసుకునే బదులు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రశాంత జీవితం గడిపేందుకు వారు ఇష్టపడుతున్నారట. ఇలాంటి ఫుల్ టైం సంతానం సగటున ఆరు వేల యువాన్ల జీతాన్ని తమ తల్లిదండ్రుల నుంచి తీసుకుంటున్నారు. చైనాలో ఇదో గౌరవప్రదమైన సంపాదన కావడంటో యువత రెండో ఆలోచన లేకుండా ఈ బాట పడుతున్నారు.
కానీ, మరికొందరు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లోనే ఫుల్ టైం సంతానంగా మారుతున్నారు. చైనాలోని మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రస్తుతం సగటు 16-64 ఏళ్ల వారి సగటు నిరుద్యోగిత 21.3 శాతానికి చేరుకుంది. దేశీయంగా తగ్గిన డిమాండ్, ప్రైవేటు రంగంలోనూ తగ్గిన ఉత్సాహం, ఒడిదుడుకుల్లో కొట్టుమిట్టాడుతున్న రియల్ ఎస్టేట్ రంగం వెరసి యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. దీంతో, కొంత జీతం తీసుకుని తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటూ ఉండిపోవడమే బెటరనే నిర్ణయానికి వచ్చారు.
అయితే, చైనాలో గతంలోనూ ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. 1980ల్లో పుట్టిన అనేక మంది చాలాకాలం పాటు తమ తల్లిదండ్రులపై ఆర్థికంగా ఆధారపడేవారట. తాము సంపాదిస్తున్నది చాలక తల్లిదండ్రుల నుంచి డబ్బులు తెచ్చుకునేవారట. అయితే, వారికి సాయంగా ఉండటంలో మాత్రం కాస్తంత అలసత్వం ప్రదర్శించేరు. దీంతో, వారిని అప్పట్లో ‘తల్లిదండ్రులపై బతికే వారుగా’ సంబోధించేవారు. అయితే, నేటి ఫుల్ టైం సంతానం మాత్రం తాము భిన్నమని ఢంకా బజాయించి చెబుతోంది. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ పెద్దల కోసం ఇంటికే పరిమితమయ్యే అనేక మంది వారి బాగోగులు తామే చూసుకుంటున్నామని చెప్పుకొచ్చారు.
కరోనా నాటి భీకర పరిస్థితులు యువత ఆలోచనా ధోరణిలో సమూల మార్పులు తెచ్చాయని చైనా సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవితంపై యువత దృక్పథం, లక్ష్యాలు సమూలంగా మారిపోయాయని అంటున్నారు. హడావుడి జీవితాలకు స్వస్తి పలికి కొందరు తల్లిదండ్రుల బాగోగులు చూసుకునే ఫుల్ టైం బిడ్డలుగా మారిపోతున్నారు.