Niger: ఆఫ్రికా దేశం నైగర్ లో సైనిక తిరుగుబాటు
- అధ్యక్షుడిని నిర్బంధించిన ప్రెసిడెన్షియల్ గార్డ్స్
- సరిహద్దులు మూసేసి దేశంలో కర్ఫ్యూ విధించిన ఆర్మీ
- 2020 నుంచి ఇప్పటి వరకు ఏడుమార్లు కుట్ర
ఆఫ్రికా దేశం నైగర్ లో బుధవారం ఉదయం సైనిక తిరుగుబాటు జరిగింది. ప్రెసిడెన్షియల్ గార్డ్స్ సభ్యులు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్ ను, ఆయన భార్యను నిర్బంధించారు. దేశ రాజధాని నియామెలో జరిగిన ఈ తిరుగుబాటుకు సైన్యం మద్దతు తెలిపింది. ఇకపై దేశంలో పాలనా వ్యవహారాలను సైన్యమే చూసుకుంటుందని, ఇతర దేశాల జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది. దేశంలోని అన్ని సంస్థలను రద్దు చేస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. సరిహద్దులను మూసేసి దేశంలో కర్ఫ్యూ విధించింది. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రకటించింది.
పశ్చిమ ఆఫ్రికాలోని నైగర్ 1960 వరకు ఫ్రాన్స్ పాలనలో ఉంది. స్వాతంత్ర్యం తర్వాత 2021లోనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్. అయితే, బజౌమ్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అప్పటి నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రెండేళ్ల వ్యవధిలోనే ఏడుసార్లు సైనిక తిరుగుబాటు జరిగిందని నైగర్ విదేశాంగ మంత్రి హస్సౌమి మస్సౌదౌ తెలిపారు. సైనిక కుట్రను తిప్పికొట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, ప్రెసిడెన్షియల్ గార్డ్స్ జనరల్ ఒమర్ టిచనీని తొలగించాలని అధ్యక్షుడు బజౌమ్ నిర్ణయించడమే తిరుగుబాటుకు దారితీసిందని సమాచారం. పొరుగున ఉన్న బాలి, బుర్కినా ఫాసో దేశాలతో కలిసి ఉగ్రవాదంపై పోరులో నైగర్ కీలకంగా వ్యవహరిస్తోంది.