Telangana: వర్షాల నేపథ్యంలో అర్ధరాత్రి వరకూ పర్యవేక్షించిన సీఎం కేసీఆర్
- మంత్రులు, అధికారులకు ఎప్పటికప్పుడు కీలక సూచనలు
- ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలన్న సీఎం
- కేసీఆర్ ఆదేశాలతో ముంపు, వరద ప్రాంతాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రమాదకర సంఘటనల నుంచి ప్రజలను రక్షిస్తూ, ప్రాణనష్ట నివారణ చర్యలు చేపట్టే దిశగా మంత్రులను, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వారికి ఎప్పటికప్పుడు ఆదేశాలిచ్చారు. మంత్రులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీర్ ప్రాణనష్టం జరగకుండా చూడాలని, అనుకోకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే వారికి మెరుగైన చికిత్స అందించేలా చూసుకోవాలని సూచించారు.
ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం సూచనలతో మంత్రులు, ప్రజా ప్రతినిధులు వరద, ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. మంత్రులు పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని పలు ముంపు ప్రాంతాలలో సహాయ చర్యల్లో ప్రత్యక్ష్యంగా పాల్గొన్నారు.