Bengaluru: కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం రెండు నెలలు తిరిగినా ఫలితం సున్నా.. ఇక తనవల్ల కాదంటూ యూఎస్‌కు బెంగళూరు సీఈవో
- బెంగళూరులో కంపెనీ పెట్టే యోచన నుంచి వెనక్కి తగ్గిన సీఈవో
- అమెరికా వెళ్లిపోతున్నాననంటూ ‘ఎక్స్’ చేసిన బ్రిజ్‌సింగ్
- రెండుగా విడిపోయిన నెటిజన్లు
దేశంలో ఓ కంపెనీ పెట్టి దానిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఎంత కష్టమో బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ వ్యవస్థాపకుడికి తెలిసొచ్చింది. రెండు నెలల పాటు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో ఇక తన వల్ల కాదని తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ పెట్టే కంపెనీ ఏదో అమెరికాలోనే పెట్టుకుంటానని, అక్కడికే వెళ్లిపోతున్నానంటూ ‘ఎక్స్’ చేశారు.
ఆయన పేరు బ్రిజ్‌సింగ్. కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం రెండు నెలలపాటు తిరిగినా ఇంకా అసంపూర్ణంగానే ఉండిపోయిందని ‘ఎక్స్’లో తన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఇప్పుడు తనకు అమెరికా తిరిగి వెళ్లిపోయే సమయం వచ్చిందని, బరువైన హృదయంతో ఈ మాట చెబుతున్నానని పేర్కొన్నారు. నెల రోజుల క్రితం వరకు ఇండియాలో ఉన్నదానికంటే బే ఏరియా (శాన్‌ఫ్రాన్సిస్కో)లో ఉన్న మూడు రోజుల్లోనే ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నారు. బ్రిజ్‌సింగ్ లింక్‌డిన్ ప్రొఫైల్ ప్రకారం.. టెక్నాలజీ, ఫైనాన్స్ సెక్టార్‌లో ఆయనకు ఇండియా, అమెరికాలో 18 సంవత్సరాల అనుభవం ఉంది.
అమెరికా వెళ్లిపోవాలన్న ఆయన నిర్ణయంపై నెటిజన్లు రెండుగా విడిపోయారు. కొందరు ఆయనకు మద్దతు ప్రకటిస్తూ తమకు ఎదురైన అనుభవాలను పంచుకుంటే మరికొందరు మాత్రం ఆయనను తప్పబడుతున్నారు. ‘‘రెండు నెలలు ఎందుకు తీసుకుంది. నేనైతే వారం రోజుల్లోనే కంపెనీ ప్రారంభించాను. నిజం చెప్పాలంటే సీఏ అవసరం లేకుండా కూడా రెండంటే రెండు రోజులకు మించి సమయం పట్టదు’’ అని మరో యూజర్ కామెంట్ చేశాడు. కంపెనీని రిజిస్టర్ చేసేందుకు రెండు వారాలకు మించి సమయం పట్టదని మరో యూజర్ పేర్కొన్నాడు. కన్సల్టెంట్‌ను కానీ, సీఏను కానీ సంప్రదించమని బ్రిజ్‌సింగ్‌కు సలహా ఇచ్చాడు.