Pakistan: ఇండియాలోకి డ్రోన్స్ ద్వారా డ్రగ్స్ చేరవేస్తున్నట్లు ఒప్పుకున్న పాక్ ఉన్నతాధికారి.. వీడియో ఇదిగో!
- దురదృష్టకరమంటూ మీడియాతో వ్యాఖ్యానించిన ప్రధాని సలహాదారు
- సొంత ప్రజలకు తిండిపెట్టే ఆలోచన చేయాలని ప్రభుత్వానికి హితవు
- సరిహద్దు ప్రాంతాల్లో వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్
సరిహద్దుల్లోని ప్రజలు వరదల్లో చిక్కుకుని ఆహారం కోసం అలమటిస్తుంటే ప్రభుత్వం మాత్రం పక్క దేశంలోకి డ్రగ్స్ చేరవేయడంపైనే దృష్టిపెట్టిందని పాకిస్థాన్ ఉన్నతాధికారి ఒకరు విమర్శించారు. పాకిస్థాన్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ దేశ ప్రధానికి రక్షణ సలహాదారైన మాలిక్ ముహమ్మద్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ హమిద్ మిర్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
‘పాకిస్థాన్ ప్రభుత్వ ఖజానా దాదాపు పూర్తిగా ఖాళీ అయింది. సొంత ప్రజలకు తిండి పెట్టే పరిస్థితి కూడా లేదు. సరిహద్దుల్లోని కౌసర్ రేంజర్స్ ఏరియా, సరిహద్దు ప్రాంతంలోని ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. వారికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ప్రభుత్వం ఆదుకోవాలి. లేదంటే తిండికోసం వారు స్మగ్లర్లతో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఈ ఏరియాలో డ్రగ్స్ ద్వారా పక్క దేశంలోకి డ్రగ్స్ రవాణా జరుగుతోంది. ఇటీవలే రెండు సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక్కో డ్రోన్ కు పది కిలోల హెరాయిన్ ను కట్టి సరిహద్దులు దాటించగా.. ఇండియన్ అధికారులు వాటిని కూల్చేశారు. ఇది చాలా దురదృష్టకరం’ అని అహ్మద్ ఖాన్ అన్నారు.