G. Kishan Reddy: అభివృద్ధి అంటే ఫ్లై ఓవర్లు కాదు, బస్తీలను కూడా బాగు చేయాలి: కిషన్ రెడ్డి
- నగరంలోని యూసుఫ్ గూడను పరిశీలించిన కేంద్ర మంత్రి
- నిజమైన హైదరాబాద్ ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శ
- 80 శాతం నిధులు వస్తున్నా 8 శాతం ఖర్చు చేయడం లేదన్న కిషన్ రెడ్డి
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లోని వర్ష, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. యూసుఫ్ గూడలో పొంగిపొర్లుతున్న నాలాలు, రోడ్లను పరిశీలించిన ఆయన సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు కాదు, బస్తీలను కూడా బాగు చేయాలన్నారు. హైదరాబాద్ నుంచి 80 శాతం నిధులు వస్తున్నా 8 శాతం కూడా వినియోగించడం లేదన్నారు.
నగరంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిందన్నారు. పూడిక తీయకపోవడంతో రోడ్లపై మురుగు పారుతోందని, బస్తీల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సీవరేజ్ బోర్డు నిధుల కొరతతో ఇబ్బంది పడుతోందని, కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వ డం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వ పెద్దలు హైటెక్ సిటీ, మాదాపూర్ కే డబ్బులు ఖర్చు చేస్తున్నారు తప్పితే బస్తీలను పట్టించుకోవడం లేనద్నారు. నిజమైన హైదరాబాద్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.