Byjus: దయచేసి హెల్ప్ చేయండి: కన్నీళ్లు పెట్టుకున్న బైజూస్ ఉద్యోగి
- తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న బైజూస్ ఉద్యోగులు
- ఉద్యోగులను, కస్టమర్లను బైజూస్ ఫ్రాడ్ చేస్తోందన్న మహిళా ఉద్యోగి
- జీతాలు, బకాయిలు చెల్లించడం లేదని ఆవేదన
మన దేశ స్టార్టప్ ల చరిత్రలో ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీ బైజూస్ ది ఒక ప్రత్యేక స్థానం. విద్యారంగంలో బైజూస్ చరిత్ర సృష్టించింది. చిన్న పిల్లల దగ్గర నుంచి సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వారి వరకు ఎన్నో రకాల కోర్సులతో బైజూస్ దూసుకుపోయింది. 22 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా ఎదిగింది. విదేశీ పెట్టుబడులు కూడా ఈ సంస్థలోకి భారీగా వచ్చాయి. ప్రస్తుతం ఈ సంస్థ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కొన్ని నెలలుగా బైజూస్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
తాజాగా ఆ కంపెనీలో అకాడెమిక్ స్పెషలిస్ట్ గా పని చేసిన ఆకాంక్ష ఖేమ్కా అనే మహిళా ఉద్యోగి లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేసిన వీడియో ఆ సంస్థ పరిస్థితి ఎలా ఉందో తేటతెల్లం చేస్తోంది. గత ఏడాదిన్నరగా ఆమె బైజూస్ లో పని చేస్తున్నారు. ఉద్యోగులను, కస్టమర్లను బైజూస్ మోసం చేస్తోందని ఆమె చెప్పారు. తన కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత మొత్తం తనపైనే ఉందని, తన బకాయిలను కూడా బైజూస్ చెల్లించలేదని ఆమె వాపోయారు. వెంటనే రాజీనామా చేయాలని తనకు లెటర్ పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన భర్తకు ఆరోగ్యం బాగోలేదని, అందువల్ల కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత తనపైనే ఉందని ఆమె చెప్పారు. తమ జీతాలను, బకాయిలను చెల్లించకుంటే తాము ఎలా బతకగలమని కంటతడి పెట్టుకున్నారు. ఈ విషపూరితమైన వర్క్ కల్చర్ నుంచి బయటపడేలా తనకు, తన సహచర ఉద్యోగులకు సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్ని విధాలుగా బైజూస్ ఫ్రాడ్ చేస్తోందని ఆరోపించారు.