Odisha: బస్సులో మొదటి ప్రయాణికురాలిగా మహిళల్నీ ఎక్కనీయండి: ఒడిశా మహిళా కమిషన్ ఆదేశాలు
- బస్సుల్లో మొదటి ప్రయాణికురాలిగా మహిళ ఎక్కితే అపశకునమనే మూఢనమ్మకం
- ఒడిశా మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త
- మహిళా ప్రయాణికులనూ మొదట ఎక్కేందుకు అనుమతించాలని సూచన
వివక్షతో కూడిన మూఢనమ్మకాలకు చెల్లుచీటి పడే విధంగా ప్రభుత్వ, ప్రయివేటు బస్సుల్లో మొదటి ప్రయాణికురాలిగా మహిళలనూ ఎక్కనివ్వాలని ఒడిశా స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఓఎస్‌సీడబ్ల్యు) రవాణాశాఖకు సూచించింది. ఇక్కడ బస్సులో తొలి ప్రయాణికురాలిగా మహిళలు ఎక్కడాన్ని కొంతమంది అపశకునంగా భావిస్తున్నట్లు కమిషన్ కు ఫిర్యాదు అందింది. దీంతో పైవిధంగా సూచనలు చేసింది.
ఒడిశాలో బస్సులో మొదట మహిళలు ఎక్కకుండా అడ్డుకున్నారని, ఇది అపశకునంగా భావించి ఆపేశారని, దీనిపై తాను మహిళా కమిషన్‌కు వెళ్లగా ఆదేశాలు జారీ చేసినట్లు ఫిర్యాదుదారు తెలిపారు.
ఇటీవల భువనేశ్వర్ బారాముండా బస్టాండ్‌లోని బస్సులో తొలి ప్రయాణికురాలిగా ఓ మహిళను ఎక్కనీయకుండా అడ్డుకున్నారంటూ సామాజిక కార్యకర్త ఘసిరామ్ పాండా.. మహిళా కమిషన్ ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన మహిళా కమిషన్.. బస్సులో మొదటి ప్రయాణికురాలు మహిళ అయితే బస్సు ప్రమాదానికి గురి కావడం లేదా ఆ రోజంతా బిజినెస్ బాగా ఉండదనే మూఢనమ్మకం ఉన్నట్లుగా గుర్తించింది. ఈ క్రమంలో మహిళా ప్రయాణికులను ముందుగా ఎక్కేందుకు అనుమతించాలని రవాణాశాఖకు సూచనలు చేసింది. అంతేకాదు, బస్సుల్లో మహిళల రిజర్వేషన్ ను 50 శాతానికి పెంచాలని సూచించింది.