Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు.. బీజేపీ కార్యకర్త అరెస్ట్!
- ఉడుపి ఘటనపై ముఖ్యమంత్రిపై బీజేపీ కార్యకర్త ఘాటు వ్యాఖ్యలు
- సిద్ధరామయ్య భార్యకో, మనవరాలికో ఇలా జరిగితే ఊరుకుంటారా? అని ప్రశ్న
- అరెస్ట్ చేసి, విడుదల చేసిన పోలీసులు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ కార్యకర్త శాకుంతలను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఉడుపి కళాశాల ఘటనను బీజేపీ సొమ్ము చేసుకోవాలని భావిస్తోందని కాంగ్రెస్ నేత పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన శాకుంతల... సిద్ధరామయ్య భార్యకో, ఆయన మనవరాలికో ఇలా జరిగితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు శాకుంతలను అరెస్ట్ చేసి, ఆ తర్వాత విడుదల చేశారు.
ఉడుపిలోని ఓ ప్రయివేటు కాలేజీ టాయిలెట్లో ఇటీవల ముగ్గురు విద్యార్థులు రహస్యంగా వీడియో రికార్డ్ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. మరుగుదొడ్డిలో ఒక విద్యార్థి ఫోన్ దొరకగా, దానిని పరిశీలించిన యాజమాన్యం అందులో ఎలాంటి అనుమానించదగిన డేటా లేదని నిర్ధారించింది. విద్యార్థిని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. అయినప్పటికీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. అలాగే, వీడియో తీసినట్లుగా అనుమానం ఉన్న ముగ్గురిని ఆదివారం సస్పెండ్ చేసింది.
ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర స్పందిస్తూ... ఇది చిన్న ఘటన అని, ఆందోళన అవసరం లేదన్నారు. కొంతమంది స్నేహితుల మధ్య జరిగిన ఘటనకు రాజకీయ రంగు పూస్తున్నారని విమర్శించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీరు సరిగా లేదని, సమస్యను చిన్నది చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నట్లుగా విపక్షాలు ఆరోపించి, ఆందోళనలు చేపట్టాయి.