Kuldeep Yadav: వెస్టిండీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్
- తొలి వన్డేలో 6 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టిన కుల్దీప్
- విండీస్ గడ్డపై అద్భుతమైన గణాంకాలను నమోదు చేసిన భారత బౌలర్ గా ఘనత
- గతంలో చాహల్ పేరిట ఉన్న రికార్డు
వెస్టిండీస్ తో బార్బడోస్ లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇండియా లెఫ్టామ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. 3 ఓవర్లు వేసిన కుల్దీప్ యాదవ్ 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో కుల్దీప్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. విండీస్ గడ్డపై మరే ఇతర భారతీయ బౌలర్ సాధించని గణాంకాలను నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు యజువేంద్ర చాహల్ పేరిట ఉండేది. గత ఏడాది జులైలో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరిగిన వన్డేలో చాహల్ 17 పరుగులకు 4 వికెట్లు తీశాడు. ఇప్పుడు ఈ రికార్డును కుల్దీప్ అధిగమించాడు.
6 పరుగులకు 4 వికెట్లు పడగొట్టిన కుల్దీప్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. మ్యాచ్ అనంతరం కుల్దీప్ మాట్లాడుతూ... గత రెండేళ్లుగా తన రిథమ్ ను మెరుగుపరుచుకోవడానికి తాను వర్కౌట్ చేశానని చెప్పాడు. గత ఏడాది కూడా తన రిథమ్ సరిగా లేదని... ఇప్పుడు గాడిలో పడిందని తెలిపాడు. మరోవైపు ఈరోజు ఇండియా, వెస్టిండీస్ ల మధ్య రెండో వన్డే జరగనుంది.