Pawan Kalyan: తమిళనాడు బాణసంచా గోడౌన్ ప్రమాదంలో 8 మంది మృతి.... పవన్ కల్యాణ్ స్పందన

Pawan Kalyan responds on Tamil Nadu fire crackers mishap

  • కృష్ణగిరి పట్టణంలో ఘోర అగ్నిప్రమాదం
  • మంటల్లో చిక్కుకున్న బాణసంచా గోడౌన్
  • ఎనిమిదికి పెరిగిన మృతుల సంఖ్య
  • ప్రమాదంలో మృతి చెందిన బాణసంచా దుకాణం యజమాని కుటుంబం
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన పవన్

తమిళనాడులో ఓ బాణసంచా గోడౌన్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ఈ ప్రమాద ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. 

తమిళనాడులోని కృష్ణగిరి పట్టణంలో ఓ బాణసంచా గోడౌన్ లో అగ్నిప్రమాదం జరిగి 8 మంది దుర్మరణం పాలవడం, మరో 12 మంది గాయపడడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా, ఈ దుర్ఘటనలో బాణసంచా దుకాణ యజమాని, అతని భార్య, కుమార్తె, కుమారుడు... మొత్తం కుటుంబం బలికావడం అత్యంత విషాదకరం అని తెలిపారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. 

బాణసంచా గోడౌన్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక దుకాణం, మరో 3 ఇళ్లు కాలిపోయాయని, అందులో అనేకమంది చిక్కుకుపోయారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని వివరించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ వెల్లడించారు. 

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, మృతి చెందిన వారి కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని, సీఎం స్టాలిన్ ను కోరుతున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు.

  • Loading...

More Telugu News