Hyderabad: మూడు రోడ్డు ప్రమాదాలు.. హైదరాబాద్ లో ముగ్గురు మృతి
- ట్యాంక్ బండ్ రెయిలింగ్ పైకి దూసుకెళ్లిన కారు
- ఈసీఐఎల్ చౌరస్తాలో బైక్ ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం
- ఆరాంఘర్ లో కారు ప్రమాదం.. మరొకరు మృతి
హైదరాబాద్ లో ఆదివారం ఉదయం గంటల వ్యవధిలోనే మూడు రోడ్డు ప్రమాదాలు జరగగా నలుగురు దుర్మరణం పాలయ్యారు. తెల్లవారుజామున ట్యాంక్ బండ్ పై ఇండికా కారు ఒకటి బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో డ్రైవర్ అతి వేగంగా వెళ్లడంతో అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీ కొట్టింది. సమయానికి ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో డ్రైవర్, మరో ప్రయాణికుడు క్షేమంగా బయటపడ్డారు. అయితే, కారు తీవ్రంగా దెబ్బతింది. కారును అక్కడే వదిలేసి వారిద్దరూ పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఓనర్ వివరాల ఆధారంగా నిందితులను ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.
కుషాయిగూడ ఈసీఐఎల్ క్రాస్ రోడ్ వద్ద ఉదయం ఓ బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో మౌలాలికి చెందిన క్రాంతి (33), జనగాం జిల్లాకు చెందిన నరేశ్ (23) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్రాంతి, నరేశ్ లు ఇద్దరూ మౌలాలి నుంచి పల్సర్ బైక్ పై వస్తుండగా ఈసీఐఎల్ చౌరస్తా వద్ద బైక్ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. కాగా, ఆరాంఘర్ లో జరిగిన కారు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. అతివేగం, రాంగ్ రూట్ లో ప్రయాణించడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.