IIT Bombay: ఐఐటీ బాంబేలో మాంసాహారం తినే విద్యార్థుల పట్ల వివక్ష!
- ఐఐటీ బాంబే క్యాంటీన్ లో పోస్టర్ల కలకలం
- శాకాహారం తినేవాళ్లే ఇక్కడ కూర్చోవాలంటూ పోస్టర్లు
- మాంసాహారం తినేవాళ్లు అక్కడ కూర్చుంటే ఖాళీ చేయిస్తున్నారని ఆరోపణలు
ప్రముఖ ఉన్నత విద్యాసంస్థ ఐఐటీ బాంబేలో మాంసాహారం చిచ్చు రేగింది. మాంసాహారం తినే విద్యార్థులపై క్యాంటీన్ లో వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. మాంసాహారం తినే విద్యార్థులు ఇక్కడ కూర్చోవద్దంటూ పలు పోస్టర్లు వెలిశాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
క్యాంపస్ లోని క్యాంటీన్ లో మాంసాహారం తిన్న ఓ విద్యార్థిని మరో విద్యార్థి అవమానించడంతో ఈ వివాదం మొదలైంది. శాకాహారం తినేవారిని మాత్రమే ఇక్కడ కూర్చునేందుకు అనుమతిస్తామని క్యాంటీన్ గోడలపై కొన్ని పోస్టర్లు దర్శనమిచ్చాయి. అంతేకాదు, మాంసాహారం తినే విద్యార్థులు ఎవరైనా అక్కడ కూర్చుంటే అక్కడ్నించి వారిని బలవంతంగా తరలిస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంబేద్కర్ పెరియార్ పూలే స్టడీ సర్కిల్ దీనిపై ట్విట్టర్ లో స్పందించింది. సమాచార హక్కు చట్టం ద్వారా వివరణ కోరగా, వచ్చిన సమాధానాన్ని ఆ స్టడీ సర్కిల్ ట్విట్టర్ లో పంచుకుంది.
మాంసాహారులు, శాకాహారులు అంటూ ఐఐటీ బాంబే క్యాంటీన్ లో ఎలాంటి విభజన లేదని సమాధానం వచ్చిందని, కానీ కొందరు వ్యక్తులు మాంసాహారుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని, శాకాహారులు మాత్రమే ఇక్కడ కూర్చునేందుకు అనుమతి ఉందంటూ పోస్టర్లు వేస్తున్నారని, ఇతరులు అక్కడ కూర్చుంటే ఖాళీ చేయిస్తున్నారని మండిపడింది.
ట్విట్టర్ లో ఈ అంశంపై తీవ్ర చర్చ మొదలైంది. ఇది అట్టడుగు వర్గాలను అవమానించడమేనని, అందుకే అలాంటి పోస్టర్లు వేశారని పలువురు విమర్శిస్తున్నారు.