Venkatesh Prasad: విండీస్ చేతిలో ఓటమి నేపథ్యంలో టీమిండియాను ఏకిపడేసిన వెంకటేశ్ ప్రసాద్
- వెస్టిండీస్ తో రెండో వన్డేలో రోహిత్, కోహ్లీలకు విశ్రాంతి
- దారుణంగా ఓడిపోయిన టీమిండియా
- గత కొంతకాలం నుంచి టీమిండియా ఆట ఇలాగే ఉందన్న వెంకీ
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు విశ్రాంతినిచ్చిన టీమిండియా రెండో వన్డేలో విండీస్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమి నేపథ్యంలో భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ టీమిండియాను ఏకిపారేశాడు.
టెస్టు క్రికెట్ ను పక్కనబెడితే, వన్డేలు, టీ20ల్లో టీమిండియా ప్రదర్శన దారుణంగా ఉందని విమర్శించాడు. గత కొంతకాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టు ప్రదర్శన నానాటికీ తీసికట్టు అన్నట్టుగా తయారైందని పేర్కొన్నాడు.
బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆసీస్ తో జరిగిన వన్డే సిరీస్ ల్లో టీమిండియా అతి సాధారణమైన జట్టుగా కనిపించిందని తెలిపాడు. గత రెండు టీ20 వరల్డ్ కప్ లలో భారత జట్టు ఆట నాసిరకంగా ఉందని విమర్శించాడు.
ఉద్విగ్న భరితంగా ఆడే ఇంగ్లండ్ కు, నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడే ఆసీస్ కు టీమిండియా ఏమాత్రం పోటీ కాదు అని వెంకీ స్పష్టం చేశాడు.
"డబ్బు, అధికారం... వీటిని వదిలేసి చూస్తే చిన్న విజయాలనే గొప్పగా భావించాల్సిన పరిస్థితిలో ఉన్నాం. చాంపియన్ జట్లకు మనవాళ్లకు ఎంత తేడా ఉందో తెలియడంలేదా? ప్రతి జట్టు విజయం కోసమే ఆడుతుంది... భారత్ కూడా అలాగే ఆడాలి కదా! కానీ మనవాళ్ల దృక్పథంలో కానీ, ఆచరణలో కానీ ఆ ఛాయలే కనిపించడంలేదు... గత కొంతకాలంగా టీమిండియా పేలవ ప్రదర్శనకు ఇవే కారణాలు" అని ఈ కర్ణాటక పేస్ దిగ్గజం అభిప్రాయపడ్డాడు.