Uttar Pradesh: దాహం తీర్చుకునేందుకు మంచినీళ్లు అడిగిన దివ్యాంగుడిపై పోలీసుల దాడి!
- ఉత్తరప్రదేశ్ దేవరీయా ప్రాంతంలో ఘటన
- దాడికి తెగబడ్డ ఇద్దరూ ప్రాంతీయ రక్షక్ పోలీసులుగా గుర్తించిన పోలీసులు
- వారిని విధుల నుంచి తప్పించినట్టు జిల్లా ఎస్పీ ప్రకటన
దాహం తీర్చుకునేందుకు మంచి నీళ్లు అడిగిన ఓ దివ్యాంగుణ్ణి ఇద్దరు పోలీసులు చితక్కొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని దేవరీయా ప్రాంతంలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, 2016లో జరిగిన ఓ రైలు ప్రమాదంలో సచిన్ అనే వ్యక్తి తన రెండు కాళ్లూ కోల్పోయాడు. ప్రస్తుతం అతడు స్థానిక రెస్టారెంట్లో డెలివరీబాయ్‌గా జీవనం సాగిస్తున్నాడు.
కాగా, శనివారం రాత్రి తన వాహనంపై ఇంటికి బయలుదేరిన అతడికి రోడ్డు మీద ఓ తాబేలు కనిపించింది. అతడు దాన్ని తీసుకుని ఆలయ సమీపంలోని కొలనులో విడిచిపెట్టాడు. ఆ తరువాత అక్కడ కనిపించిన ఇద్దరు ప్రాంతీయ రక్షక్ పోలీసులను మంచినీళ్లు అడిగాడు. ఈ మాత్రానికే వారు రెచ్చిపోయి అతడిని చావబాదారు. సమీపంలోని ఓ వ్యక్తి ఈ ఉదంతాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్‌గా మారింది. విషయం ఉన్నత స్థాయి అధికారుల వరకూ వెళ్లడంతో వారు రంగంలోకి దిగారు. నిందితులను రాజేంద్ర మణి, అభిషేక్ సింగ్‌గా గుర్తించారు. వారిని విధుల నుంచి తొలగించినట్టు జిల్లా ఎస్పీ మీడియాకు తెలిపారు.