Bombay High Court: అబార్షన్ కోసం మైనర్ దరఖాస్తు.. కుదరదన్న బాంబే హైకోర్టు
- మరో 15 వారాల్లో డెలివరీ ఉండగా అబార్షన్ కు అనుమతివ్వలేమని వ్యాఖ్య
- ఏడాదిగా ఫ్రెండ్ తో శారీరక సంబంధం కొనసాగిస్తున్న అమ్మాయి అమాయకురాలేం కాదన్న కోర్టు
- పుట్టిన బిడ్డను ఎవరికైనా దత్తత ఇచ్చుకునే హక్కు ఆమెకు ఉందని వివరణ
ఏడాదిగా స్నేహితుడితో శారీరక సంబంధం కొనసాగిస్తున్న అమ్మాయిని అమాయకురాలిగా భావించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ప్రసవానికి మరో 15 వారాలు ఉందనగా అబార్షన్ కు అనుమతివ్వలేమని స్పష్టం చేసింది. తనకు తానుగా గర్భ నిర్ధారణ చేసుకున్న అమ్మాయి.. గర్భం తనకు ఇష్టంలేదని భావించినపుడు అప్పుడే దరఖాస్తు చేసుకోవాల్సిందని వ్యాఖ్యానించింది. ఈమేరకు 17 ఏళ్ల బాలిక అబార్షన్ కోసం తల్లి సహకారంతో పెట్టుకున్న దరఖాస్తును బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ కొట్టేసింది.
మహారాష్ట్రకు చెందిన ఓ మైనర్ బాలిక తన స్నేహితుడితో శారీరక సంబంధం కొనసాగించింది. ఫలితంగా గర్భందాల్చింది. తాజాగా అబార్షన్ కోసం తల్లి సహకారంతో బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్ట ప్రకారం తాను మైనర్ నని, అబార్షన్ కు అనుమతివ్వాలని కోరింది. చట్ట ప్రకారం 20 వారాల గర్భం దాటిన సందర్భాలలో మెడికల్ అబార్షన్ కు అనుమతి తప్పనిసరి. దీంతో బాలిక తల్లి కోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్ ను జస్టిస్ రవీంద్ర, జస్టిస్ వైజీ ఖోబ్రగడే నేతృత్వంలోని బెంచ్ విచారించింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన ధర్మాసనం.. బాలికకు ఈ నెలాఖరుతో 18 ఏళ్లు నిండుతాయని, కొన్ని నెలలుగా తన స్నేహితుడితో శారీరక సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించింది. ఫిబ్రవరిలో ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకుని స్వయంగా పరీక్షించి గర్భందాల్చినట్లు నిర్ధారించుకుందని తెలిపింది. గర్భం వద్దని భావిస్తే అప్పుడే కోర్టును ఆశ్రయించాల్సిందని బెంచ్ అభిప్రాయపడింది. 24 వారాల ప్రెగ్నెన్సీ సమయంలో అబార్షన్ చేస్తే బిడ్డ ప్రాణాలతోనే పుడతారని, బ్రతకడం మాత్రం కష్టమని చెప్పింది. ఈ నేపథ్యంలో అబార్షన్ కు అనుమతివ్వలేమని, పుట్టిన బిడ్డను ఎవరికైనా దత్తతకు ఇచ్చుకునే స్వేచ్ఛ ఆమెకు ఉందని బెంచ్ తెలిపింది.