Nara Lokesh: ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన యువగళం యాత్ర.. భావోద్వేగానికి గురైన నారా లోకేశ్
- ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 17 రోజల పాటు కొనసాగిన లోకేశ్ పాదయాత్ర
- ప్రకాశం జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానన్న లోకేశ్
- ముప్పరాజుపాలెం వద్ద గజమాలలు, బాణసంచా మోతలతో మోతెక్కించిన టీడీపీ శ్రేణులు
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో అంకాన్ని పూర్తి చేసుకుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని ఉమ్మడి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 17 రోజుల పాటు లోకేశ్ యాత్ర కొనసాగింది. వినుకొండ నియోజకవర్గ శివార్లలో ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి కుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, దామచర్ల సత్య, నూకసాని బాలాజీ, విజయకుమార్, ఎరిక్షన్ బాబు, కందుల నారాయణరెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి తదితర నేతలు లోకేశ్ ను హత్తుకుని వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా నారా లోకేశ్ భావోద్వేగానికి గురయ్యారు. తనను తోబుట్టువు మాదిరి ఆదరించిన ప్రకాశం జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. ఏ కష్టమొచ్చినా పార్టీ కేడర్ వెన్నంటి ఉంటానని భరోసా ఇచ్చారు. యువగళం స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో పసుపు జెండా రెపరెపలాడాలని చెప్పారు. నాయకులందరూ కలిసికట్టుగా పని చేసి పార్టీని విజయపథంలో నడిపించాలని అన్నారు.
అనంతరం, లోకేశ్ కు ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. వినుకొండ నియోజకవర్గం ముప్పరాజుపాలెం వద్ద పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు నేతృత్వంలో యువ నేతను సాదరంగా స్వాగతించారు. వేదపండితుల ఆశీర్వచనాలతో స్వాగతం పలికారు.
తెనాలి శ్రావణ్ కుమార్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, కొమ్మాలపాటి శ్రీధర్, కోవెలమూడి రవీంద్ర, నజీర్ అహమ్మద్, వేగేశన నరేంద్ర వర్మ, మన్నవ మోహనకృష్ణ, చదలవాడ అరవింద్ బాబు, భాష్యం ప్రవీణ్, కందుకూరి వీరయ్య, గోనుగుంట్ల కోటేశ్వర రావు, పోతినేని శ్రీనివాస్ తదితర నేతలు లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం పలికారు. పల్నాడు జిల్లాకు చెందిన వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఉమ్మడి గుంటూరు జిల్లాలోకి లోకేశ్ ప్రవేశించారు. ఈ సందర్భంగా భారీ గజమాలలు, స్వాగతద్వారాలు, బాణసంచా మోతలతో వినుకొండ కార్యకర్తలు మోతెక్కించారు. లోకేశ్ కు మహిళలు హారతులు పట్టారు.