No Confidence Motion: మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం.. లోక్ సభలో చర్చకు తేదీల ఖరారు
- ఆగస్ట్ 8 నుంచి మూడు రోజుల పాటు అవిశ్వాస తీర్మానంపై చర్చ
- 10వ తేదీన ప్రసంగించనున్న మోదీ
- లోక్ సభలో ఎన్డీయేకు పూర్తి మెజార్టీ
మణిపూర్ హింసపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేస్తారని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ విపక్ష సభ్యులు ఏమాత్రం తగ్గలేదు. మోదీనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చాయి. విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్ స్వీకరించారు.
ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగనుంది. ఆగస్టు 10వ తేదీన ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. లోక్ సభలో ఎన్డీయేకు పూర్తి మెజార్టీ ఉంది. విపక్ష ఇండియా కూటమికి 144 మంది ఎంపీల బలం ఉంది. ఈ నేపథ్యంలో, అవిశ్వాస తీర్మానం నుంచి కేంద్ర ప్రభుత్వం సులువుగా గట్టెక్కుతుంది. ఈ విషయం విపక్షాలకు తెలిసినప్పటికీ... కేవలం మణిపూర్ ఘటనపై మోదీ స్పందించాలనే లక్ష్యంతోనే విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.