Nara Lokesh: ఇన్ఛార్జీ లేకపోయినా దర్శిలో పాదయాత్ర విజయవంతం అయింది: నారా లోకేశ్
- దర్శిలో బలమైన అభ్యర్థిని నిలబెడతామన్న లోకేశ్
- దొంగ ఓట్లపై దృష్టి పెట్టాలని సూచన
- జగన్ కు సొంత సామాజికవర్గంలో కూడా వ్యతిరేకత ఉందని వ్యాఖ్య
టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది. వినుకొండ నియోజకవర్గంలోకి లోకేశ్ అడుగుపెట్టారు. అంతకు ముందు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరిలో పట్టుదల ఉందని, కచ్చితంగా టీడీపీ గెలవబోతోందని చెప్పారు. అనునిత్యం ప్రజలతో ఉండే బలమైన అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. పార్టీకి ఇన్ఛార్జీ లేకపోయినా దర్శి నియోజకవర్గంలో పాదయాత్ర సక్సెస్ అయిందని చెప్పారు. ఎన్నికల తర్వాత ఇన్ఛార్జీ వ్యవస్థ ఉండదని అన్నారు.
గ్రామ కమిటీలను బలోపేతం చేస్తామని చెప్పారు. భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వర్గ విభేదాలను పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం పని చేయాలని చెప్పారు. దొంగ ఓట్లపై దృష్టి పెట్టాలని చెప్పారు. సీఎం జగన్ కు సొంత సామాజికవర్గంలో కూడా వ్యతిరేకత ఉందని అన్నారు.