bro: చెప్పాల్సిన అవసరం లేదు!: అంబటి రాంబాబు వ్యాఖ్యలపై బ్రో సినిమా నిర్మాత స్పందన
- విదేశాల నుండి వచ్చే డబ్బులకు ఆర్బీఐ రూల్స్ ఉంటాయన్న విశ్వప్రసాద్
- పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ చెప్పాల్సిన అవసరం లేదని వెల్లడి
- శ్యాంబాబు క్యారెక్టర్ నెగిటివ్‌గా అనిపించలేదన్న నిర్మాత
పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో' సినిమాపై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు చేసిన విమర్శల మీద నిర్మాత విశ్వప్రసాద్ స్పందించారు. ఆయన టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... అంబటి చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. తాము పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై సినిమాను నిర్మించామన్నారు. నెట్ ఫ్లిక్స్, జీ తెలుగు తమకు ఆదాయ మార్గాలు అన్నారు. విదేశాల నుండి డబ్బులు వచ్చాయన్న మంత్రి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అమెరికా నుండి ఇండియాకు బ్లాక్ మనీ తీసుకు రావడం అసాధ్యమని చెప్పారు. విదేశాల నుండి వచ్చిన డబ్బుకు ఆర్బీఐ రూల్స్ ఉంటాయన్నారు.
పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్, ఈ సినిమాకు అయిన ఖర్చును చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఓటీటీలో తమకు మంచి బిజినెస్ ఉందని, తాము ప్రొడక్షన్ లోకి వచ్చి అయిదేళ్లవుతోందన్నారు. అంబటి చెబుతున్న శ్యాంబాబు క్యారెక్టర్‌తో ఆయనకు సంబంధం లేదన్నారు. ఇందులో డ్రెస్ ఒకటే మ్యాచ్ అయిందని, అయినప్పటికీ శ్యాంబాబు క్యారెక్టర్ తమకు నెగిటివ్‌గా అనిపించలేదని తెలిపారు. క్రియేటివ్‌గా ఉంటుందనే బ్రో సినిమాలో ఆ క్యారెక్టర్ పెట్టినట్లు చెప్పారు.