Daggubati Purandeswari: ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులపై లెక్కలు చెప్పిన పురందేశ్వరి!
- జగన్ ప్రభుత్వం చేసిన అప్పులకు, తప్పులకు మల్లగుల్లాలు పడుతోందన్న పురందేశ్వరి
- ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్
- నిర్మలా సీతారామన్ ఆర్బీఐ పరిధిలో తీసుకున్న అప్పుల గురించి చెప్పారని వెల్లడి
- తాను అనధికారికంగా చేసిన అప్పులు గురించి చెప్పానని వివరణ
ఆంధ్రప్రదేశ్ అప్పులపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. జగన్ ప్రభుత్వం గత నాలుగేళ్లలో తాను చేసిన అప్పులకు, తప్పులకు మల్లగుల్లాలు పడుతోందన్నారు. రిజర్వుబ్యాంకుకు చూపించిన రూ.16 లక్షల కోట్ల ఆదాయం ఎలా వచ్చిందనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనాతో రాష్ట్రానికి రూ.40వేల కోట్ల అప్పులు తీసుకునే వెసులుబాటు కలిగిందని తెలిపారు. ఇతర వనరుల ద్వారా అదనంగా అప్పులు చేశారన్నారు.
ఏపీపై రూ.10.77 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని తాను ఇదివరకే చెప్పానని, ఇందులో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా చేసిన అప్పు రూ.7 లక్షల కోట్లు ఉందని చెప్పానన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్బీఐ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాల గురించి మాత్రమే సమాధానం పార్లమెంటులో చెప్పారని, కానీ తాను అనధికారికంగా చేసిన అప్పుల గురించి కూడా చెప్పానన్నారు.
కార్పొరేషన్లను తాకట్టుపెట్టి రూ.98,928 కోట్లు, ఆస్తుల తనఖా పెట్టి రూ.98 వేల కోట్లు, సోషల్ సెక్యూరిటీ బాండ్స్ ద్వారా రూ.8,900 కోట్లు, ఏపీ ఫైనాన్సియల్ సర్వీసుల ద్వారా రూ.10 వేల కోట్ల రుణం, విద్యుత్ సంస్థల బకాయిలు రూ.20,384 కోట్లు, సివిల్ సఫ్లైస్ నుండి 35 వేల కోట్లు, లిక్కర్ బాండ్ల ద్వారా 8,375 కోట్లు తీసుకున్నారన్నారు. అంతేకాకుండా, చిన్న కాంట్రాక్టర్లకు రూ.71 కోట్లు, ఉద్యోగులకు రూ.33 వేల కోట్ల బకాయిలు, వివిధ ప్రభుత్వ సంస్థల నుండి తీసుకున్న డిపాజిట్ రూ.1170 కోట్లు, పబ్లిక్ ఖాతా ఫండ్స్ నుండి రూ.26,235 కోట్లు తీసుకున్నారన్నారు. అలాగే ఇతర ఫండ్స్‌ను దారి మళ్లించారన్నారు.