Oppo A78: ఒప్పో నుంచి బడ్జెట్ ధరలో 4జీ స్మార్ట్ ఫోన్
- ఒప్పో ఏ78 4జీ వెర్షన్ విడుదల
- 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ.17,499
- ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
- ఎక్స్ టెండెడ్ వారంటీ, స్క్రీన్ ప్రొటెక్షన్ ప్లాన్
ప్రముఖ చైనా కంపెనీ ఒప్పో భారత మార్కెట్లో 4జీ ఆధారిత స్మార్ట్ ఫోన్ ‘ఒప్పో ఏ78’ను విడుదల చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒప్పో ఏ78 మోడల్ 5జీ వెర్షన్ ఎనిమిది నెలల క్రితమే భారత మార్కెట్లోకి విడుదల అయింది. ఇప్పుడు 5జీ కంటే ముందు టెక్నాలజీ అయిన 4జీతో ఇదే మోడల్ ను ఒప్పో తీసుకొచ్చింది. ఈ రెండింటిలో కొన్ని మార్పులను గుర్తించొచ్చు.
డిస్ ప్లే హోల్ పంచ్ కటౌట్ తో ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 680 చిప్ సెట్ తో వస్తుంది. అదే 5జీ వెర్షన్ లో డిస్ ప్లే వాటర్ డ్రాప్ నాచ్ తో, డైమెన్సిటీ 700 5జీ చిప్ సెట్ తో ఉంటుంది. రెండు ఫోన్లలో వెనుక భాగంలో డ్యుయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. ఒప్పో ఏ78 4జీ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ.22,999. కాకపోతే ఇది రూ.17,499కే లభిస్తోంది. ఆక్వాగ్రీన్, మిస్ట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. కొంచెం అదనంగా చెల్లిస్తే ఎక్స్ డెండెడ్ వారంటీ, స్క్రీన్ ప్రొటెక్షన్ ప్లాన్ తో వస్తుంది. ఒకవేళ ఒప్పో ఏ78 5జీ వెర్షన్ తీసుకోవాలంటే రూ.18,999కే సొంతం చేసుకోవచ్చు.
ఒప్పో ఏ78 4జీ ఫోన్ లో 6.43 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోలెడ్ డిస్ ప్లే, 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు, 600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. వెనుక భాగంలో 50 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ పొట్రెయిట్ కెమెరాను చూడొచ్చు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. స్టీరియో స్పీకర్ సదుపాయం కూడా ఉంది. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేయగా, 67 వాట్ సూపర్ వూక్ చార్జర్ ఉంటుంది.