Vijay mallya: ఆ ఒక్క పనే విజయ్ మాల్యా పతనానికి కారణం: బయోకాన్ కిరణ్ మజుందార్

thats the mistake ruin Vijay mallya fall kiran maMazumdar shah

  • కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ స్థాపించడాన్ని తప్పిదంగా పేర్కొన్న కిరణ్ మజుందార్ 
  • 2008లో ఎయిర్ డెక్కన్ కొనుగోలుతో పతనం మొదలైందన్న కిరణ్
  • బీర్ వ్యాపారానికే పరిమితై ఉంటే గొప్ప వ్యాపారిగా ఉండేవారన్న అభిప్రాయం

ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా గురించి తెలియని వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే బ్యాంకులకు రూ.9,000 కోట్లకు పైగా రుణాలు ఎగవేసి, విదేశాలకు పారిపోయిన వ్యక్తిగా ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం బ్రిటన్ లో తలదాచుకుంటున్న ఆయన్ను భారత్ కు తీసుకువచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ఆయనపై ముద్ర పడింది. దీనంతటికీ కారణం ఆయన స్థాపించిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అనే చెప్పుకోవాలి. 

2008 వరకు విజయ్ మాల్యా దేశంలో లిక్కర్ కింగ్ గా గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యాపారవేత్త. మెక్ డొవెల్ (ఇప్పుడు యునైటెడ్ స్పిరిట్స్), యునైటెడ్ బ్రూవరీస్ సంస్థలకు అధినేతగా ఉన్నారు. కానీ, చివరకు వ్యాపారాలన్నీ అమ్ముకుని, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మూసేసుకుని విదేశానికి పారిపోయే పరిస్థితికి దారి తీసిన కారణాన్ని.. మరో ప్రముఖ వ్యాపారవేత్త బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా వెల్లడించారు. జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్ కాస్ట్ లో తన అభిప్రాయాలను ఆమె పంచుకున్నారు. 

మాల్యాను తనకు మంచి స్నేహితుడిగా ఆమె పేర్కొన్నారు. తనను సోదరిగా ఆయన పిలిచే వారని చెప్పారు. యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ అధినేతగా ఉన్న మాల్యా కొత్త వ్యాపారాల్లో ప్రయత్నాలు చేశారని, ఆ క్రమంలో 2003లో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ స్థాపించడమే ఆయన చేసిన పెద్ద తప్పు అని కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు. 2008లో ఎయిర్ డెక్కన్ ను కొనుగోలు చేసిన తర్వాత నుంచి మాల్యా పతనం మొదలైనట్టు చెప్పారు. 

‘‘వేగంగా అంతర్జాతీయ సర్వీసుల్లోకి వెళ్లడమే పెద్ద తప్పిదం. ఎయిర్ డెక్కన్ ను కొనుగోలు చేసిన నాటి నుంచి ఆయన సామ్రాజ్య క్షీణత మొదలైంది. ఎయిర్ లైన్స్ ఆర్థికంగా లాభసాటి కాలేదు. బీర్ వ్యాపారం వెలిగిపోతోంది. దానికే పరిమితమై ఉంటే అతడు ఇప్పటికీ గొప్ప విజయవంతమైన వ్యాపారవేత్తగా కొనసాగే వారు’’ అని కిరణ్ మజుందార్ షా వివరించారు.

  • Loading...

More Telugu News