Supreme Court: హర్యానా హింసపై వీహెచ్ పీ, బజరంగ్ దళ్ నిరసన ర్యాలీపై పిటిషన్.. సుప్రీం కీలక నిర్ణయం!
- హర్యానా హింసకు వ్యతిరేకంగా ఢిల్లీలో వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ ర్యాలీ
- ఈ ప్రదర్శనలపై నిషేధం కోరుతూ సుప్రీం కోర్టుకు వెళ్లిన ఓ జర్నలిస్ట్
- అత్యవసరంగా విచారించాలని కోరిన పిటిషన్‌దారు
- అప్పటికప్పుడు పరిశీలించి, వెంటనే స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేసిన సీజేఐ
- హిందూ సంస్థల ప్రదర్శన నిలిపివేయాలన్న పిటిషన్ ను తోసిపుచ్చిన ధర్మాసనం
హర్యానాలో ఘర్షణలకు సంబంధించి దాఖలైన ఓ అత్యవసర పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370 విషయంలో దాఖలైన పిటిషన్‌పై విచారణను కాసేపు పక్కన పెట్టి, హర్యానా ఘర్షణలకు సంబంధించిన పిటిషన్‌ను విచారించింది. ఢిల్లీలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ మద్దతుదారులు తలపెట్టిన ర్యాలీపై దాఖలైన పిటిషన్ కోసం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అప్పటికప్పుడు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేశారు.
హర్యానాలోని నూహ్‌లో చోటు చేసుకున్న ఘర్షణలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ మద్దతుదారులు ఢిల్లీలో బుధవారం నిరసన తలపెట్టారు. ఈ ప్రదర్శనలపై నిషేధం కోరుతూ ఓ జర్నలిస్ట్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సదరు జర్నలిస్ట్ తరఫు లాయర్ అత్యవసర విచారణ కావాలని జస్టిస్ అనిరుద్ బోస్‌ను కోరారు. ఈ విషయంలో జస్టిస్ చంద్రచూడ్‌ను ఆశ్రయించాలని జస్టిస్ బోస్ సూచించగా, ఆయన సీజేఐని ఆశ్రయించారు.
ఈ సమయంలో జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పిటిషన్‌ను సీజేఐ న్యాయమూర్తి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. అయితే సున్నితమైన అంశం దృష్ట్యా పరిశీలించాలని సదరు జర్నలిస్ట్ కోరగా, సీజేఐ తన ఛాంబర్ లోకి వెళ్లి ఆ పత్రాలను పరిశీలించారు. ఆ వెంటనే జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్‌తో కూడిన స్పెషల్ బెంచ్‌ను ఏర్పాటు చేశారు.
మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ చేపట్టాలని రిజిస్ట్రీకి ఆదేశాలు ఇచ్చారు. అప్పటికే రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా పదిహేను నిమిషాల్లో విచారణను ముగించి, తిరిగి ఆర్టికల్ 370 విచారణలో భాగమయ్యారు. ఇక విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ మద్దతుదారులు తలపెట్టిన ప్రదర్శనను నిషేధించాలనే వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం.. నిరసనలలో ఎలాంటి హింస, విద్వేష ప్రసంగాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.