Allahabad High Court: 18 ఏళ్లలోపు వారి సహజీవనం అనైతికమే.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

Minor cant be in a live in relationship says Allahabad High Court

  • ఉత్తరప్రదేశ్ కేసులో స్పష్టం చేసిన కోర్టు
  • అమ్మాయి మేజర్ అన్న కారణంతో బాలుడికి విచారణ నుంచి రక్షణ లభించదన్న కోర్టు
  • అది అక్రమ సంబంధం కిందికే వస్తుందని స్పష్టీకరణ

మైనర్ల సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 18 ఏళ్ల లోపు వారి సహజీవనాన్ని అనైతికంగా పేర్కొంది. సహజీవనం చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండాలని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల యువతి వేసిన క్రిమినల్ రిట్‌పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఆ యువతి 17 ఏళ్ల యువకుడితో ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రయాగ్‌రాజ్‌లో సహజీవనం చేస్తోంది. ఆమె తల్లిదండ్రులు వారిని వెతికిపట్టుకుని వెనక్కి తీసుకొచ్చారు. యువకుడిపై కిడ్నాప్ కేసు పెట్టారు. రెండ్రోజుల తర్వాత యువతి ఇంటి నుంచి తప్పించుకుని జరిగిన విషయాన్ని యువకుడి తండ్రికి చెప్పింది.

ఆ తర్వాత కోర్టును ఆశ్రయిస్తూ ఇష్టపూర్వకంగానే తాను యువకుడితో కలిసి ఉంటున్నానని, అతడిపై నమోదైన కేసును కొట్టివేయాలని అభ్యర్థించింది. అతడిని అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని కోరింది. విచారించిన న్యాయస్థానం ఆమె విజ్ఞప్తిని తిరస్కరించింది. మేజర్ అయిన అమ్మాయితో సహజీవనం చేస్తున్నంత మాత్రాన అబ్బాయి నేర విచారణ నుంచి రక్షణ కోరలేడని, అతడి చర్యలు చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. 

బాలుడు ముస్లిం అని పేర్కొన్న ధర్మాసనం.. ముస్లిం లా ప్రకారం అమ్మాయితో అతడి సంబంధం ‘జినా’ (అక్రమ సంబంధం) కిందికి వస్తుందని పేర్కొంది. 18 ఏళ్లలోపు వారిని పిల్లలుగానే పరిగణించాలని స్పష్టం చేసింది. వారి సహజీవనాన్ని అనుమతిస్తే చట్టవిరుద్ధమైన చర్యకు అంగీకారం తెలిపినట్టు అవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. వారిద్దరూ సహజీవనం చేస్తున్న మాట వాస్తవమే అయినా అతడు ఆమెను మోసపూరితంగా ప్రలోభపెట్టి ఇంటి నుంచి తీసుకెళ్లాడా? లేదా? అనే విషయాన్ని దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News