Uddhav Thackeray: హర్యానా ఘర్షణలు: డబుల్ ఇంజన్ ఎక్కడన్న ఉద్ధవ్ థాకరే
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని నిలదీసిన మహారాష్ట్ర మాజీ సీఎం
- రామరాజ్యం అంటే ఇదేనా అంటూ విమర్శ
- మణిపూర్ లో మహిళలను కాపాడే ప్రయత్నం కూడా చేయట్లేదని మండిపడ్డ థాకరే
హర్యానాలో జరుగుతున్న ఘర్షణలపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే కేంద్ర ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించారు. డబుల్ ఇంజన్ సర్కారుతో మాత్రమే అభివృద్ధి సాధ్యమన్న బీజేపీ నేతలు హర్యానాలో అల్లర్లు జరుగుతుంటే ఏంచేస్తున్నారని నిలదీశారు. మణిపూర్ లో మూడు నెలలుగా జరుగుతున్న హింసాత్మక ఆందోళనలను ఎందుకు ఆపలేకపోతున్నారని మండిపడ్డారు. మణిపూర్, హర్యానాలో ఉన్నది బీజేపీ ప్రభుత్వాలేనని, కేంద్రంలోనూ ఆ పార్టీ కూటమే అధికారంలో ఉన్నదని గుర్తుచేశారు. డబుల్ ఇంజన్ సర్కారు ఇప్పుడేం చేస్తోందని నిలదీశారు.
మణిపూర్ లో మహిళలపై దారుణాలు జరుగుతున్నా చేష్టలుడిగి చూస్తున్నారని ఉద్ధవ్ థాకరే ఆరోపించారు. కనీసం మహిళలను రక్షించే ప్రయత్నం కూడా చేయని నేతలు హిందూత్వ గురించి మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఇలాంటి నేతల నుంచి ప్రజా సంక్షేమం ఏం ఆశిస్తామని నిర్వేదం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న హింసను ప్రస్తావిస్తూ.. రామరాజ్యం అంటే ఇదేనా? అంటూ ఉద్ధవ్ థాకరే కేంద్రాన్ని ప్రశ్నించారు.