India tour of West Indies: విండీస్‌తో నేడు తొలి టీ20.. టీమిండియాలోకి ముగ్గురు ఆటగాళ్ల అరంగేట్రం!
- టెస్టు, వన్డే సిరీస్ గెలిచిన భారత జట్టు
- యశస్వి జైస్వాల్, తిలక్‌వర్మ, ముకేశ్ కుమార్‌కు అవకాశం
- చాహల్, కుల్దీప్ యాదవ్‌లలో ఒకరికి చాన్స్
వెస్టిండీస్‌పై టెస్టు, వన్డే సిరీస్‌ను గెలుచుకుని జోష్ మీదున్న భారత జట్టు నేటి నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. ఆతిథ్య జట్టుపై టీమిండియా బలంగానే ఉన్నప్పటికీ పొట్టి ఫార్మాట్‌లో మాత్రం ఆ జట్టు అద్భుతాలు చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా రోవ్‌మన్ పావెల్, నికోలస్ పూరన్ వంటివారు జట్టు స్వరూపాన్ని ఒక్కసారిగా మార్చేయగలరు. మరోవైపు, రెండో వన్డేలో మార్పులు చేసి విమర్శలు మూటగట్టుకున్న భారత జట్టు టీ20ల్లోనూ మార్పులకు సిద్ధమైంది. ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌లను దృష్టిలో పెట్టుకుని రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీకి మేనేజ్‌మెంట్ ఇప్పటికే విశ్రాంతినిచ్చింది. ఆసియాకప్‌కు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ దూరమైనట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో జట్టు కూర్పుపై దృష్టి పెట్టింది.
వన్డే సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్న ఇషాన్ కిషన్‌కు టీ20ల్లో విశ్రాంతి ఇచ్చి సంజుశాంసన్‌ను కొనసాగించే వీలుంది. అలాగే, ముగ్గురు ఆటగాళ్లు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, టెస్టుల్లోనూ అదే జోరు కొనసాగించిన యశస్వి జైస్వాల్ నేటి మ్యాచ్‌తో టీ20ల్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. శుభమన్‌గిల్‌తో కలిసి అతడు ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. యువకులతో నిండిన జట్టులో సూర్యకుమార్ యాదవ్ మిడిలార్డర్‌లో చెలరేగిపోవాల్సి ఉంటుంది. జట్టులోని అనుభవజ్ఞులైన కెప్టెన్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ నుంచి అతడికి మద్దతు లభిస్తుంది.
తిలక్‌వర్మ కూడా నేటి మ్యాచ్‌తో టీ20ల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబరించిన వర్మ ముంబై ఇండియన్స్‌పై 46 బంతుల్లో 84 పరుగులు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 17 బంతుల్లో 37 పరుగులు చేశాడు. అతడికి భారత జట్టులో చోటు ఖాయమని అప్పట్లోనే రోహిత్‌శర్మ, మాజీ కోచ్ రవిశాస్త్రి జోస్యం చెప్పారు. నేటి మ్యాచ్‌తో అది నిజమయ్యే అవకాశం ఉంది.
ఈ టూర్‌లో ఇప్పటి వరకు చాన్స్ లభించని యుజ్వేంద్ర చాహల్‌కు స్పిన్ విభాగంలో అవకాశం లభించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే కుల్దీప్ యాదవ్‌తో అతడికి పోటీ ఉండే అవకాశం ఉంది. ఆఖరి వన్డేలో విండీస్ టాపార్డర్‌ను చిత్తు చేసిన ముకేశ్ కుమార్‌కు కూడా టీ20 చాన్స్ దక్కే అవకాశం ఉంది. అర్షదీప్‌సింగ్‌తో కలిసి బంతి పంచుకోవొచ్చు. ఉమ్రాన్ మాలిక్ యథేచ్ఛగా పరుగులు సమర్పించుకుంటుండడంతో అతడి స్థానంలో అవేశ్‌ఖాన్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.