first period: ఆ 'పీరియడ్'లో మహిళల పట్ల అసహ్యంగా ప్రవర్తించే తీరు నచ్చలేదంటున్న తండ్రి!
- పీరియడ్స్ అనేవి ప్రకృతి సహజమనే అభిప్రాయం
- అందరినీ పిలిచి కేక్ కట్ చేయించి వేడుక
- కానుకలుగా శానిటరీ ప్యాడ్లు, చాక్లెట్లు
కూతురు రజస్వల అయితే వేడుక చేసుకోవడం సాధారణమే. కాకపోతే హిందూ ఆచారంలో కొన్ని రోజుల పాటు వారిని వేరుగా కూర్చోబెట్టిన తర్వాతే అందరినీ పిలిచి వేడుక చేసుకుంటారు. ఉత్తరాఖండ్ లోని ఉధమ్ సింగ్ నగర్ కు చెందిన జితేంద్ర భట్ అనే సంగీత ఆచార్యుడు మాత్రం దీనికి భిన్నంగా చేసిన సంగతి విదితమే. కుమార్తె పుష్పవతి అయితే ఆమెను వేరుగా ఉంచడం దురాచారమనే అభిప్రాయంతో అలా చేయలేదు. పైగా టీనేజర్స్ ను పిలిచి తన కుమార్తె తో కేక్ కట్ చేయించి చక్కగా వేడుక నిర్వహించారు.
బర్త్ డే పార్టీ మాదిరిగా బెలూన్లతో అలంకరణ చేసి ఆయన పది మంది సమక్షంలో సంబరాలు నిర్వహించిన వార్తలు ఇటీవల మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. రజస్వల కావడం ప్రకృతి సహజమంటూ, దాన్ని చాటుగా ఉంచకుండా సంబరం చేసుకోవాలని మరీ ఆయన తన అభిప్రాయాన్ని ప్రకటించారు. ఇక ఈ వేడుకకు హాజరైన బాలిక స్నేహితురాళ్లు శానిటరీ ప్యాడ్స్, చాక్లెట్లను కానుకలుగా తెచ్చి ఇచ్చారు.
జితేంద్ర భట్ చేసిన ఈ వేడుక వివరాలను హ్యుమన్స్ ఆఫ్ బోంబే సంస్థ తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ప్రతీ నెలా కొన్ని రోజుల పాటు తన సోదరీమణులు, తల్లి, పిన్ని, అత్తలు ఇంటికి దూరంగా వెదురుతో చేసిన గూడారాల్లో ఉండాల్సి వచ్చేదంటూ తను చిన్నప్పుడు చూసిన అనుభవాలను భట్ పంచుకున్నారు. తనకు పదో తరగతికి వచ్చిన తర్వాతే పీరియడ్స్ వల్ల అలా జరిగేదని తెలిసిందని, మహిళల పట్ల అసహ్యంగా ప్రవర్తించే తీరు తనకు నచ్చలేదని చెప్పారు. తన కుమార్తెకు ఆ కష్టం వద్దని చెప్పి ఆయన ఇలా చేసినట్టు కనిపిస్తోంది.