Cobra: విజయవాడ కలెక్టరేట్ భవనంలో హడలెత్తించిన నాగుపాము
- రెవెన్యూ అధికారి చాంబర్ వెనుక ముళ్లపొదలు
- పొదల్లోంచి ఉద్యోగుల క్యాబిన్ లోకి ప్రవేశించిన విషసర్పం
- భయంతో బయటికి పరుగులు తీసిన ఉద్యోగులు
- పామును పట్టుకున్న అటవీశాఖ సిబ్బంది
ఒక్కసారిగా పాము కళ్లెదుట ప్రత్యక్షమైతే ఆ భయం వర్ణనాతీతం! విజయవాడలోని కలెక్టరేట్ ఉద్యోగులకు ఆ భయం అనుభవంలోకి వచ్చింది. పైగా అది నాగుపాము కావడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.
జిల్లా కలెక్టరేట్ లోని రెవెన్యూ అధికారి చాంబర్ పక్కనే ఇతర ఉద్యోగుల క్యాబిన్ ఉంది. ఆ చాంబర్ వెనుక ముళ్ల పొదలు ఉండడంతో, అందులోంచి ఒక నాగుపాము ఉద్యోగుల క్యాబిన్లోకి ప్రవేశించింది. 4 అడుగుల పొడవున్న ఆ విషసర్పాన్ని చూడగానే ఉద్యోగులు హడలిపోయారు. క్యాబిన్ నుంచి పరుగులు పెట్టారు.
జనాల అలజడి కారణంగా పాము ఆ క్యాబిన్లోనే ఉండిపోయింది. దాంతో కలెక్టరేట్ అధికారులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఆ ప్రమాదకరమైన నాగుపామును ఎంతో నేర్పుగా పట్టుకున్నారు. అనంతరం దాన్ని అక్కడి నుంచి తరలించడంతో, ఉద్యోగులు తమ క్యాబిన్లోకి అడుగుపెట్టారు.