Ajay Ghosh: వేషాలు లేనప్పుడు కూలి పనులకు వెళ్లాను: నటుడు అజయ్ ఘోష్
- ప్రత్యేకమైన పాత్రలను పోషించే అజయ్ గోష్
- దేవ కట్టా ఫస్టు ఛాన్స్ ఇచ్చాడని వెల్లడి
- వేషాలు లేని రోజుల్లో కూలి పనులకు వెళ్లానన్న నటుడు
- సుకుమార్ ఒక మెట్టు ఎక్కించాడని వ్యాఖ్య
అజయ్ ఘోష్ .. అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చిన నటుడు. కూలి పనుల నుంచి అందరూ గుర్తించే స్థాయికి చేరుకున్న నటుడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నేను మా ఊళ్లో కూలి పనులకు వెళుతూ ఉండేవాడిని .. వీలును బట్టి నాటకాలు వేస్తూ ఉండేవాడిని. అలా నటన వైపు ఆసక్తితో వచ్చాను. సీరియల్స్ చేస్తూ వెళ్లాను" అని అన్నారు.
'సినిమాల్లో అవకాశాల కోసం తిరిగి .. తిరిగి అలసిపోయాను. మొదటి సినిమా 'ప్రస్థానం'లో దేవ కట్టా గారు ఛాన్స్ ఇచ్చారు .. ఆ తరువాత చేసిన 'జ్యోతి లక్ష్మి'తో గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తరువాత కూడా ఏడాదిన్నర వేషాలు లేక .. మళ్లీ కూలి పనులకే వెళ్లడం జరిగింది. 'రంగస్థలం' .. 'పుష్ప' సినిమాలలో నాకు మంచి వేషాలనిచ్చి ప్రోత్సహించింది సుకుమార్ గారు " అని చెప్పారు.
"నటుడిగా నేను ఇంకా సంతృప్తి చెందలేదు. కానీ తెలుగులో పూరి .. సుకుమార్, తమిళంలో వెట్రి మారన్ వంటి దర్శకుల సినిమాలలో చేశాను .. అది నాకు సంతోషాన్ని ఇచ్చిన విషయం. త్వరలో విడుదల కానున్న 'బెదురులంక'లో కూడా మంచి వేషం వేశాను. యువ దర్శకులు కూడా మంచి వేషాలను ఇస్తున్నారు" అని చెప్పుకొచ్చారు.