Virat Kohli: తప్పు నువ్వు చేస్తూ మాకు నీతులా? విరాట్ కోహ్లీపై నెటిజన్ల గుస్సా
- వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నుంచి సీనియర్లకు విరామం
- ప్రత్యేక చార్టర్ విమానంలో స్వదేశానికి విరాట్ కోహ్లీ పయనం
- చార్టర్ విమానంతో వాయుకాలుష్యం అధికమంటూ కోహ్లీపై నెటిజన్ల గుస్సా
- పర్యావరణం పరిరక్షణపై నిత్యం క్లాసులు తీసుకునే వారు కట్టుతప్పొచ్చా అంటూ ప్రశ్నల పరంపర
భారత స్టార్ క్రికెటర్, విరాట్ ‘కింగ్’ కోహ్లీపై నెటిజన్లు ప్రస్తుతం దుమ్మెత్తిపోస్తున్నారు. ‘నువ్వు తప్పులు చేస్తూ మాకు నీతులు చెబుతావా?’ అంటూ మండిపడుతున్నారు. వెస్టిండీస్ వండే టూర్ ముగించుకుని చార్టెడ్ ఫ్లైట్‌లో విరాట్ ఇండియాకు తిరిగి రావడం ఈ వివాదానికి దారితీసింది.
ఇటీవల టీమిండియా వెస్టిండీస్‌పై వండే సిరీస్‌లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విరాట్ కూడా అజేయ సెంచరీతో అదరగొట్టాడు. ప్రస్తుతం భారత్ వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో పాల్గొంటోంది. కానీ, సీనియర్ ప్లేయర్లకు బీసీసీఐ విరామం ఇవ్వడంతో విరాట్ స్వదేశానికి బయలుదేరాడు. అయితే, విరాట్ కోసం గ్లోబల్ ఎయిర్ చార్టర్ సర్వీస్ ప్రత్యేకంగా ఓ చార్టర్ ఫ్లైట్ ఏర్పాటు చేసింది. ఈ విషయాలను కింగ్ కోహ్లీ నెట్టింట పంచుకున్నాడు. తన తిరుగుప్రయాణానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ సదరు సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.
ఇక్కడివరకూ అంతా బాగానే ఉన్నా విరాట్ తనకంటూ ప్రత్యేకంగా ఓ చార్టర్ విమానంలో ప్రయాణించడం జనాలకు అసలేమాత్రం నచ్చలేదు. నిత్యం వాయుకాలుష్యం గురించి మాట్లాడే విరాట్, అనుష్కకు ప్రత్యేక విమానాలు పర్యావరణానికి ఎంతటి హానికరమో తెలీదా? అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ‘సమయం దొరికినప్పుడల్లా మాకు వాయుకాలుష్యం గురించి లెక్చర్లు దంచే మీరు మాత్రం ఎటువంటి జాగ్రత్తలూ తీసుకోరా?’ అంటూ ఘాటు ప్రశ్నలు సంధిస్తున్నారు. ద్వంద్వ ప్రమాణాలు పాటించేవారి తీరును బహిరంగంగా ఎండగట్టాలంటూ అనేక మంది ఫైరైపోయారు.