Meenakshi Lekhi: సైలెంట్ గా ఉంటారా? లేక ఈడీ అధికారులను ఇంటికి రమ్మంటారా?: పార్లమెంట్ లో మంత్రి మీనాక్షి లేఖి
- మంత్రి వ్యాఖ్యలపై మండిపడుతున్న ప్రతిపక్ష నేతలు
- దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి ఇదే నిదర్శనమని విమర్శలు
- పార్లమెంట్ సాక్షిగా మంత్రి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. గురువారం లోక్ సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ చర్చలో కేంద్ర మంత్రి మాట్లాడుతుండగా ప్రతిపక్ష నేతలు బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రి తీవ్రంగా స్పందించారు. ‘శాంతంగా ఉండండి. సభలో సైలెన్స్ మెయిన్ టెయిన్ చేయండి. లేదా మీ ఇంటికి ఈడీ అధికారులు వస్తారు’ అని అన్నారు. దీనిపై ప్రతిపక్ష నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని కొంతకాలంగా ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. వివిధ రాష్ట్రాలలోని ప్రతిపక్ష నేతలు, కీలక నేతలపై ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్ష నేతలనే టార్గెట్ చేసుకుని దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులతో తమ నేతలను భయపెట్టి బీజేపీలోకి చేర్చుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి మాటలే నిదర్శనమని టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే విమర్శించారు. కేంద్ర మంత్రి మీనాక్షి తన వ్యాఖ్యలతో ప్రతిపక్ష నేతలను హెచ్చరిస్తున్నారా? లేక బెదిరిస్తున్నారా? అంటూ ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడే క్రాస్టో ప్రశ్నించారు.