Huge sinkhole: అపార్ట్ మెంట్ కింద భారీ గుంత.. బీజింగ్ లో వరదలతో వెలుగులోకి..!
- టైఫూన్ డాక్సూరితో వణికిపోతున్న బీజింగ్
- ఓ అపార్ట్ మెంట్ పునాది వద్ద భారీ గుంత
- అందులోకి ఇంకిపోతున్న వరద నీరు
- అదేంటో కూడా అర్థం కాని పరిస్థితి
బీజింగ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్న వార్తలు రెండు రోజులుగా వింటున్నాం. టైఫూన్ డాక్సూరితో చైనాకు పెద్ద విపత్తు వచ్చి పడింది. వేలాది మంది వరద నీటిలో చిక్కుకుపోయారు. ఈ వరదలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లోకి చేరిన ఓ వీడియో ఇప్పుడు పెద్ద వైరల్ గా మారింది. ఓ అపార్ట్ మెంట్ పునాదుల వద్ద పాతాళాన్ని తలపించేలా అతిపెద్ద సింకోల్ ఏర్పడింది. సదరు అపార్ట్ మెంట్ పునాది వద్ద ఏర్పడిన అతిపెద్ద గుంతలోకి భారీ వరదనీరు వెళుతుండడం వీడియోలో కనిపిస్తోంది.
అంత నీరు ఎక్కడికి వెళుతుందో కూడా అర్థం కావడం లేదు. బీజింగ్ పశ్చిమాన ఇది కనిపించింది. వరదల తీవ్రత ఎంత భారీగా ఉందో ఈ ఒక్క వీడియో క్లిప్ చూసి అర్థం చేసుకోవచ్చు. చివరికి విమానాశ్రయం సైతం నీట మునిగిన పరిస్థితి ఎదురైంది. చైనా ఇటీవలి కాలంలో ఎదుర్కొన్న అతిపెద్ద ప్రకృతి వైపరీత్యం ఇదే కావడం గమనార్హం.