Rahul Gandhi: మోదీ ఇంటిపేరు కేసులో రాహుల్ గాంధీకి ఊరట.. జైలు శిక్ష అమలుపై స్టే విధించిన సుప్రీంకోర్టు!
- ‘మోదీ ఇంటి పేరు’ వ్యాఖ్యలపై రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు
- శిక్ష అమలుపై స్టే విధించాలంటూ సుప్రీంను ఆశ్రయించిన కాంగ్రెస్ నేత
- వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వీ
- రాహుల్‌పై మోపిన నేరం.. సమాజానికి వ్యతిరేకం కాదని వెల్లడి
‘మోదీ ఇంటి పేరు’పై చేసిన వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీం స్టే విధించింది. శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాను నిర్దోషినని, తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టును రాహుల్ గాంధీ ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. పరువు నష్టం దావా వేసిన ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ అసలు ఇంటిపేరు మోదీ కాదని చెప్పారు. ‘మోదీ’ పేరును ఆయన తర్వాత పెట్టుకున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘రాహుల్ నేరస్థుడు కాదు. ఆయనపై మోపిన నేరం.. సమాజానికి వ్యతిరేకం కాదు. కిడ్నాప్, అత్యాచారం, హత్య కాదు” అని విన్నవించారు.