Professors: ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
- 2019కి ముందు జరిగిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చెల్లవన్న ఏపీ ప్రభుత్వం
- ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా ఏపీ హైకోర్టు తీర్పు
- రిజర్వేషన్లకు లోబడి జరిగిన నియామకాలను ఎలా తొలగిస్తారన్న సుప్రీం ప్రశ్న
ప్రొఫెసర్లను తొలగించిన కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురయింది. ప్రొఫెసర్లను కొనసాగించాలంటూ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే 2019కి ముందు జరిగిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చెల్లవంటూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు హైకోర్టులో సవాల్ చేశారు. అయితే ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పును వెలువరించింది. దీంతో హైకోర్టు తీర్పును వీరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ప్రొఫెసర్ల తరపున సీనియర్ న్యాయవాది రాజగోపాల్ వాదిస్తూ... రిజర్వేషన్లకు లోబడే వీరి నియామకాలు జరిగాయని తెలిపారు. రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాత కూడా వీరిని ఎలా తొలగిస్తారని ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్లను కొనసాగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. దీంతో ప్రభుత్వం తరపు న్యాయవాది స్టేట్మెంట్ ను రికార్డు చేసుకుని ప్రొఫెసర్లను వెంటనే నియమించాలని కోర్టు ఆదేశించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై విచారణను వాయిదా వేసింది.