Nara Lokesh: నేను తప్పు చెస్తే నా తండ్రే నన్ను జైలుకు పంపుతాడు: నారా లోకేశ్
- తప్పుడు ఆరోపణలు చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టబోనన్న లోకేశ్
- అవాస్తవ ప్రచారం చేసే వైసీపీ నేతలు, సంస్థలపై 8 కేసులు దాఖలు చేసినట్టు వెల్లడి
- నేడు అజయ్ రెడ్డి, సాక్షిలపై వేసిన క్రిమినల్ కేసుల్లో వాంగ్మూలం ఇచ్చినట్టు వివరణ
తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు.
స్కిల్ డెవలప్ మెంట్ కి నిధులు మంజూరు చేయించి స్కాంకి పాల్పడినట్టు తనపై నిరాధార ఆరోపణలు చేసిన స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డిపై, స్కిల్ స్కాంపై ఈడీ కొరడా అంటూ అభూతకల్పనలతో కథనం రాసి తన పరువుప్రతిష్ఠలకు భంగం కలిగించారని సాక్షి మీడియాపై మంగళగిరి అడిషినల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో లోకేశ్ క్రిమినల్ కేసులు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట లోకేశ్ శుక్రవారం నాడు వాంగ్మూలం ఇచ్చారు.
అనంతరం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. "నియంత జగన్ కి మూడు కోరికలున్నాయి. అందులో మొదటిది తల్లి, చెల్లిని గెంటేయడం అయిపోయింది. రెండోది రాజకీయ ఎదుగుదలకి అడ్డుగా ఉన్న బాబాయ్‌ని లేపేశారు. ఇక మూడోది చంద్రబాబు గారిని, నన్ను ఏదో ఒక తప్పుడు కేసులోనైనా ఒక్క రోజైనా అరెస్ట్ చేయించడం. ఇది సాధ్యం కాలేదు. అందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
జగన్ లా నేను అవినీతి చేయలేదు. నీతిగా, చిత్తశుద్ధితో పనిచేస్తున్నాను. మాపై వందల ఆరోపణలు చేసి నిరూపించలేకపోయారు. పింక్ డైమండ్ మాయం, టీడీపీ ప్రభుత్వ హయాంలో 6 లక్షల కోట్ల అవినీతి, అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్, ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్ స్కాం అంటూ వైసీపీ అనేక ఆరోపణలు చేసింది. వీటిలో ఏ ఒక్కదానిలో ఒక్క ఆధారమూ బయటపెట్టలేదు. ఒక్క కేసూ నిరూపించలేదు.
మా పిన్ని చనిపోతే నాపై చాలా ఘోరమైన ఆరోపణలు చేసింది వైసీపీ. నా తల్లి, భార్య, కొడుకు దేవాన్ష్ ను కూడా ట్రోల్ చేస్తున్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఐటీ ఇన్సెంటివ్‌లు ఇచ్చానని ఆరోపించారు. విశాఖ ఎయిర్ పోర్టులో రూ.25 లక్షల స్నాక్స్ తిన్నానని తప్పుడు రాతలు రాయించారు. నాడు ఎన్టీఆర్ నుంచి నేడు నా వరకు... మా కుటుంబంపై చేసిన ఏ ఆరోపణా నిరూపించలేకపోయారు. ఇదీ మా నీతి-నిజాయతీకి నిదర్శనం. భారతదేశంలోనే ప్రతి ఏటా ఆస్తులు ప్రకటించే ఏకైక కుటుంబం మాది.
జగన్ లా తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని దోచుకోలేదు. ఉదయం ఏదైనా కంపెనీకి భూమి ఇస్తే సాయంత్రం జగన్ లా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించలేదు. తప్పులు చేసిన జగన్ లా 16 నెలలు జైలుకెళ్లలేదు. జగన్ ది జైలు లైఫ్... నాది కాలేజీ లైఫ్. జగన్‌కి జైలు మేట్స్ ఉంటే నాకు క్లాస్ మేట్స్ ఉన్నారు.
నా కుటుంబంపై, తెలుగుదేశం పార్టీపై విషప్రచారం చేశారు. నా వ్యక్తిత్వంపై బురద చల్లేందుకు అన్ని మార్గాల్లోనూ తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పులు చేయను... తప్పుడు ప్రచారం చేసే ఎవ్వరినీ వదిలిపెట్టను. అందుకే, తప్పుడు ఆరోపణలు చేసిన, కట్టుకథలు రాసిన వారందరిపైనా వరుసగా పరువునష్టం దావాలు వేస్తున్నాను. ఇప్పటివరకూ సివిల్, క్రిమినల్ కలిపి 8 కేసులు వేశాను. ఇంకా వేస్తాను.
చట్టాన్ని ఉల్లంఘించి మరీ టీడీపీ కేడర్‌ని ఇబ్బంది పెడుతున్న అధికారులు, మీడియా సంస్థలపైనా న్యాయపోరాటం కొనసాగుతుంది. తప్పుడు వార్తలు రాయాలన్నా, అవాస్తవ ప్రచారం చేయాలన్నా ఒక్కొక్కడూ భయపడేలా చేస్తాను.
నేను తప్పుచేస్తే నా తండ్రే నన్ను జైలుకి పంపుతాడు. జగన్ తండ్రిలా కాపాడడు. మేము ఆధారాలతో సహా జగన్ అవినీతిపై ఆరోపణలు చేశాం. యువగళం పాదయాత్రలో సాక్ష్యాలు, ఆధారాలతో వైసీపీ నేతలు, ఎమ్మెల్యేల బండారం బయటపెడుతున్నాను. ధర్మవరం కేటు గాడి బండారం ఆధారాలతో సహా బయటపెట్టాను.
విజయసాయిరెడ్డి మాపై పింక్ డైమండ్ ఆరోపణలు చేశారు. జగన్ సీఎం, ఆయన బాబాయ్ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్. వీరి దగ్గర ఆధారాలు ఉంటే పింక్ డైమండ్ గుట్టు రట్టు చేయాలి కదా! తిరుమల వెంకటేశ్వరస్వామిని కూడా రాజకీయాలకు వాడుతున్న నీచులు వైసీపీ వాళ్లు. దేవాన్ష్ ప్రతీ పుట్టినరోజుకి తిరుమలలో అన్నదానానికి ఇప్పటివరకూ రూ.3 కోట్లు దానం చేశాం. మాపైనే ఆరోపణలు చేశారంటే ఏమనుకోవాలి.
జగన్ అందరిని మోసం చేశాడు. అమరావతిలో వివాదంలో ఉన్న భూమిలో పేదలకి ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తాడు? మేం అధికారంలోకి వస్తే అన్ని రకాల మౌలిక వసతులతో పేదలకి ఇళ్లు కట్టిస్తాం. మంగళగిరిలో గెలవబోయేది టీడీపీనే. అందరి సంక్షేమం చూసే బాధ్యత నాదే" అంటూ నారా లోకేశ్ ఉద్ఘాటించారు.