PCB: భారత్ లో మా భద్రతపై లిఖితపూర్వక హామీ ఇస్తేనే...!: పాకిస్థాన్ జట్టు కొత్త మెలిక
- భారత్ లో వరల్డ్ కప్ టోర్నీ
- పాకిస్థాన్ జట్టు పాల్గొనడంపై సందిగ్ధత
- ఇటీవలి వరకు ప్రభుత్వం అనుమతించాల్సి ఉందన్న పాక్ బోర్డు
- ఇప్పుడు భద్రతా అంశంపై ఐసీసీకి లేఖ
ఈ ఏడాది భారత్ లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. మొన్నటిదాకా "మా ప్రభుత్వం అనుమతిస్తేనే భారత్ లో వరల్డ్ కప్ ఆడేందుకు వస్తాం" అని చెబుతున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు కొత్త మెలిక పెట్టింది. భారత్ లో తమ జట్టు భద్రతపై లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేస్తోంది. ఈ మేరకు పాక్ ప్రభుత్వంతో కలిసి ఐసీసీకి లేఖ రాసింది. లిఖితపూర్వక హామీ ఉంటే తప్ప తమ జట్టు భారత్ లో అడుగుపెట్టబోదని పేర్కొంది.
భారత్ లో వరల్డ్ కప్ అక్టోబరు 5న ప్రారంభమై నవంబరు 19తో ముగియనుంది. అక్టోబరు 14న దాయాదుల మ్యాచ్ జరగనుంది. ఈ మహా సమరానికి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలుస్తోంది. అయితే ఇక్కడ్నంచి మ్యాచ్ వేదిక మార్చాలని తొలుత డిమాండ్ చేసిన పాక్ ఆ తర్వాత పట్టువిడుపు ప్రదర్శించింది. ఇప్పుడు భద్రత పేరుతో మరోసారి సందిగ్ధతకు తెరలేపింది.
పాక్ ప్రభుత్వం, అక్కడి క్రికెట్ బోర్డు వైఖరి చూస్తుంటే ఆ జట్టు భారత్ కు రావడంపై అనుమాన మేఘాలు ముసురుకుంటున్నాయి. తాజా లేఖపై ఐసీసీ స్పందించాల్సి ఉంది.