Mallu Bhatti Vikramarka: హైదరాబాద్ చుట్టూ ఐదు ఆసుపత్రులు కడతామని చెప్పిన ప్రభుత్వం ఒక్కటైనా కట్టిందా?: మల్లు భట్టివిక్రమార్క
- తొమ్మిదేళ్లలో కనీసం ఒక్క ఆసుపత్రిని కూడా నిర్మించలేదన్న భట్టి
- విద్యలో తెలంగాణ చివరి నుండి ఆరో స్థానంలో ఉందన్న భట్టి
- ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం నామమాత్రంగా మిగిలిందని విమర్శ
హైదరాబాద్ చుట్టూ ఐదు ఆసుపత్రులు కడతామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కటైనా కట్టిందా? అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిలదీశారు. తొమ్మిదేళ్లలో కనీసం ఒక్క ఆసుపత్రిని కూడా నిర్మించలేదన్నారు. అసెంబ్లీలో వైద్యం, విద్యపై చర్చ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. విద్యలో తెలంగాణ చివరి నుండి ఆరో స్థానంలో ఉందన్నారు. మరోవైపు ఫీజు రీయింబర్సుమెంట్స్ అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యలో ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే తెలంగాణ కంటే తక్కువగా ఉన్నాయన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం నామమాత్రంగా మిగిలిందని, ఫీజు బకాయిల వల్ల విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేకపోతున్నారన్నారు.
వైద్య విద్య ఫీజులు భారీగా పెంచి పేదలకు భారంగా మార్చారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు సరైన సిబ్బంది లేరన్నారు. పోనీ ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్తే ఇల్లు, పొలం అమ్ముకునే పరిస్థితి ఉందన్నారు. ఉస్మానియాలో కొత్త భవనం నిర్మించేందుకు ఇంకా స్థలం ఉందని చెప్పారు.